Mahabubnagar Teacher Sridhar Story :మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా శ్రీధర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పాఠం చెప్పాడంటే సైన్స్ అంటే ఇష్టపడని విద్యార్థులు కూడా ఆ పాఠ్యాంశం పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. కేవలం బోర్డు మీద పాఠాలు చెప్పడమే కాకుండా విషయం ఏదైనా సరే మన చుట్టూ జరిగే నిత్య ఘటనల ఆధారంగా, ప్రయోగాత్మకంగా వివరిస్తారు. అందుకే శ్రీధర్ సార్ చెప్పే సైన్స్ అంటే విద్యార్థులు ఎంతగానో ఇష్టపడతారని చెబుతున్నారు ఆయన తోటి ఉపాధ్యాయులు.
విద్యార్థుల కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఉపాధ్యాయుడు శ్రీధర్ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. జాయ్ ఫుల్ లర్నింగ్ విత్ సెల్ఫ్ కలెక్టెడ్ మెటీరియల్ పేరుతో ఆయన చేసిన పరిశోధనకు 2018లో నేషనల్ టీచర్స్ సైన్స్ కాంగ్రెస్ జాతీయస్థాయి అవార్డు ఇచ్చింది. ఆయన ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన వినూత్న ప్రయోగాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతేకాదు 2017,2018,2019, 2022లో విద్యార్ధులు చేసిన ఆవిష్కరణలు. అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాలకు ఎంపికయ్యాయి.
కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలన్నదే సంకల్పం : విద్యార్థులు అన్ని రకాల ప్రయోగాలు చేసుకోవడానికి సుమారు రూ.12 లక్షల సొంత డబ్బును వెచ్చించి ఆయన ఇంటిపై ఏపీజే అబ్దుల్ కలాం పేరిట సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. అంతిమంగా విద్యార్థులు అక్కడ ప్రయోగాలు చేయాలి. తద్వారా సైన్స్ ఎంతో కొంత నేర్చుకోవాలి. కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలనేదే ఆయన సంకల్పం. దాతల సహకారంతో సైన్స్‌పై శిబిరాలు నిర్వహిస్తూ NIN, IICT, NGRI, RCI, CCMB, బిర్లా సైన్స్ సెంటర్, షార్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు పిల్లలను సందర్శనకు తీసుకెళ్తారు. ఆరుసార్లు ఉత్తర భారత విద్యా యాత్రలు నిర్వహించి రాష్ట్రపతిని కలిసే అవకాశాన్ని కల్పించారు.