Eenadu Golden Jubilee Celebrations :తెలుగు తల్లి మానస పుత్రికగా ఈనాడు పత్రికను అభివర్ణిస్తూ ఓ చిత్రకారుడు తన కుంచె నుంచి ఒక అద్భుత చిత్రాన్ని జాలు వార్చారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు విజయ్ ఈనాడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ గీసిన చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగు భాషకు ఈనాడు చేసిన సేవను ప్రతిబింబించేలా చిత్రాన్ని గీశారు. 2008లో కర్నూలు ఈనాడు యూనిట్ కార్యాలయంలో ఈనాడు దినపత్రిక నిర్వహించిన వ్యంగ్య చిత్రాల పోటీల్లో పాల్గొని జిల్లాస్థాయిలో మొదటి స్థానం దక్కించుకున్నాని ఆయన గుర్తుచేసుకున్నారు.
Eenadu 50 Years Celebrations :కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అశోక్ శ్రీనాథ్ అనే సూక్షకళాకారుడు ఈనాడు దినపత్రిక 50 వసంతాల పేరును పెన్సిల్ ముక్కుపై తీర్చిదిద్దాడు. సూక్ష్మకళలో రాణించడడానికి ఈనాడు ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటూ అభిమానంతో పెన్సిల్ ముక్కుపై సూక్షంగా తీర్చిదిద్దానని తెలిపారు.
కృతజ్ఞతలు తెలిపిన అమరావతి రైతులు :ఈనాడు పత్రిక 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రాజధాని రైతులు, మహిళలు విషెస్ తెలియజేశారు. తుళ్లూరులో ఈనాడు, ఆంధ్రప్రదేశ్, అమరావతి, 50 స్వర్ణోత్సవ శుభాకాంక్షలని ముగ్గుతో అలంకరించారు. అమరావతి ఉద్యమానికి తోడ్పాటునందించిన ఈనాడు సంస్థకు పాదాభివందనాలు, 50 వసంతాల స్వర్ణోత్సవ శుభాకాంక్షలు అంటూ నినాదాలు చేశారు. అమరావతి ఉద్యమానికి అండదండలు అందించిన ఈనాడు సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈనాడు దినపత్రిక 50 ఏళ్లుగా నిష్కల్మషంగా వార్తలు ఇస్తూ ప్రజలతో మమేకవుతుందని సీనియర్ పాఠకుడు డొక్కా గోపాలమార్తి అన్నారు. కోనసీమ జిల్లా లంకల గన్నవరం గ్రామానికి చెందిన ఈయన 96 ఏళ్ల వయసులో ఈనాడు చదవనిదే రోజుగడవదని చెబుతున్నారు. మాతృభాషకు పట్టం కడుతూ నిత్యం ప్రజల పక్షాన ఈనాడు దినపత్రిక 50 వసంతాలు పూర్తిచేసుకున్నందుకు అమలాపురం మున్సిపల్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ఈనాడు మీతోడు పేరిట విద్యార్థులతో మొక్కలు నాటించారు.