తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి సన్నిధికి వచ్చినవారు వ్యవహరించాల్సిన తీరుపై, మాట్లాడే విధానంపై ఇటీవల ఓ తీర్మానం చేసింది. దాన్ని తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామిని భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఆ స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచీ.. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆ దేవదేవుడికి ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి కాపాడమని భగవంతుడిని వేడుకుంటారు. తిరుమల కొండపైకి రాగానే.. భక్తుల్లో భక్తిభావం ఉప్పొంగుతుంది. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి వాతావరణాన్ని కొందరు రాజకీయ నాయకులు దెబ్బ తీస్తున్నారు.
రోజూవారీ జీవనంలో ఎన్నో సమస్యలతో సతమతమయ్యే జనాలు.. తిరుమల కొండపై ఆద్యంతం భక్తి భావంలోనే ఉండాలని కోరుకుంటారు. స్వామి కీర్తనలు వింటూ, ఆలపిస్తూ.. ఆయన సేవలో తరించాలని ఆశిస్తారు. కానీ.. కొందరు నేతలు తిరుమలను కూడా రాజకీయ వేదికగా మార్చేస్తున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. కొంతకాలంగా కొందరు పొలిటికల్ లీడర్లు.. దర్శనానంతరం ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. విమర్శలు చేస్తున్నారు. కొందరికి ఇది పరిపాటిగా తయారైంది.
ఈ తీరుపై భక్తులు అసంతృప్తితో ఉన్నారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడడంపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా వ్యవహరించడం వల్ల స్వామివారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బ తింటోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. తిరుమల పవిత్రతను, కొండపైన భక్తుల ప్రశాంతతను కాపాడేందుకు.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి సన్నిధిలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని తాజాగా అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ఈ నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వెళ్లేది వేంకటేశ్వర స్వామిని ప్రశాంతంగా దర్శించుకునేందుకేనని, అలాంటి వాతావరణాన్ని రాజకీయ వ్యాఖ్యలు కలుషితం చేస్తున్నాయని అంటున్నారు. విమర్శలు, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై, కొండపైన భక్తులెవరికీ అలాంటి మాటలు వినిపించవని, ఎలాంటి ఆటంకమూ లేకుండా స్వామి సేవలో తరించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.