Pollution in Nellore District : నెల్లూరు జిల్లాలోని ముత్తకూరు, టీపీ గూడూరు మండలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నాయి. చుట్టుపక్కల పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం, దుమ్ముధూళి వలన తాగే నీరు నుంచి తినే తిండి, ఇళ్లు, పొలాలు, ఆఖరికి మనుషులు వేసుకున్న దుస్తులతో సహా అన్నీ నల్లగా మారుతున్నాయి. ఈ కాలుష్య ప్రభావంతో అనారోగ్యం బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యని పరిష్కరించాలని అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని బాధిత గ్రామస్థులు వాపోతున్నారు.
ముత్తుకూరు మండలంలోని 10 పంచాయతీలు, టీపీ గూడూరు మండలంలోని రెండు గ్రామాలన్నో ఏళ్లుగా కాలుష్యంలోనే కాలం వెళ్లదీస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోని పామాయిల్ పరిశ్రమల నుంచి నిత్యం వెలువడుతున్న పొగ, దుమ్ముధూళితో నివాస ప్రాంతాలు నల్లగా మారుతున్నాయి. బాయిలర్ల నుంచి వెలువడే బూడిద, దుర్గంధంతో గాలి, నీరు, ఆహారం, పొలాలు కలుషితం అవుతున్నాయి. దీని వలన చర్మ సంబంధిత, శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల కాలుష్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు.
"ఈ ఫ్యాక్టరీల గత కొంతకాలంగా బూడిదను బయటకు వదులుతున్నాయి. దాని వలన పర్యావరణం మొత్తం నాశనం అయిపోయింది. బూడిద వల్ల చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. యువకులకు, మహిళలకు సైతం అనేక సమస్యలు వస్తున్నాయి. రహదారులపై దుమ్ము అంతా విస్తరించడంతో రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నాం.సమస్యని పరిష్కరించాలని మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు" - స్థానికులు