ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు - రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య - Viral Fevers Tension In AP - VIRAL FEVERS TENSION IN AP

People Suffering From Viral Fevers: ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ల్లునొప్పులు వంటి లక్షణాలతో అధిక శాతం మంది బాధపడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్లు నొప్పులతో బాధపడేవారూ ఎక్కువగా ఉంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం డెంగీ, మలేరియా కంటే విష జ్వరాలు వేధిస్తున్నాయి.

People Suffering From Viral Fevers
People Suffering From Viral Fevers (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 2:12 PM IST

People Suffering From Viral Fevers in Joint Krishna District : ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంట్లో ఒకరు తర్వాత మరొకరు విషజ్వరాలతో అల్లాడుతున్నారు. ప్లేట్‌ లెట్స్‌ తగ్గిపోవడంతో నీరసించి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ల్లునొప్పులు వంటి లక్షణాలతో అధిక శాతం మంది బాధపడుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులు మాత్రం త్వరగా తగ్గట్లేదు. జ్వరం వచ్చిన రెండు రోజుల్లోనే బాధితులు నీరసిస్తున్నారు. డెంగీ, మలేరియా లక్షణాలతో మరికొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం డెంగీ, మలేరియా కంటే విష జ్వరాలు వేధిస్తున్నాయి. జిల్లాలో వివిధ ఆసుపత్రులను పరిశీలించగా జ్వరపీడితులు అధికంగా కనిపించారు.

రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు - బాధితులతో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు - Viral Fevers Tension In AP

నందిగామలోని డీవీఆర్‌ ప్రభుత్వ వైద్యశాల, ప్రైవేట్‌ ఆసుపత్రులు, మండలాల్లో పీహెచ్‌సీలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. నందిగామలో ఉన్న ఏరియా వైద్యశాలకు ఎప్పుడూ 350 మందిపైగా రోగులు వస్తున్నారు. వీరిలో వంద మందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నవారే ఉంటున్నారు. 15 సంవత్సరాలలోపు పిల్లలు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. చాలా గ్రామాల్లో ఆర్‌ఎంపీ డాక్టర్​లతో చికిత్స చేయించుకుంటున్నారు. అప్పటికీ జర్వం తగ్గకపోతే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

ఐదు రోజుల కిందట నాకు జ్వరం వచ్చింది. ఆర్‌ఎంపీ ఇచ్చిన మందులు రెండు రోజులు వేసుకున్నా తగ్గలేదు. తర్వాత ఏడాది వయసున్న నా కుమార్తెకు జ్వరం సోకింది. తగ్గకపోవడంతో ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాం. జ్వరం తగ్గినా నీరసం, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. - కృష్ణవేణి, నందిగామ

తిరువూరులో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జలుబు, దగ్గు, జ్వరంతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి రక్త పరీక్షలు చేస్తున్నారు. రోజుకు 250 మంది రోగులు వస్తున్నా రెండు రోజులుగా జ్వరపీడితుల సంఖ్య కాస్త తగ్గింది. ఈ సంవత్సరం జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు.

మైలవరంలో ఉన్న స్థానిక 50 పడకల సీహెచ్‌సీకి వస్తున్న రోగుల్లో అత్యధిక మంది తీవ్ర ఒళ్లు నొప్పులతో వస్తున్నారు. వీరికి మలేరియా, టైఫాయిడ్, డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత 25 రోజుల్లో 416 మందికి టైఫాయిడ్‌ పరీక్షలు చేయగా 98 మందికి టైఫాయిడ్‌ ఉన్నట్లు తెలిసింది. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ఒకరికి రూ.15 వేలు నంచి 20 వేలు అవుతోందని బాధితులు వాపోతున్నారు.

నేను కూలీ పనికెళ్తా. మూడు వారాల కిందట జ్వరం వచ్చింది. ఆర్‌ఎంపీ వద్ద చూపించా. మందులు, చికిత్సకు రూ.4 వేలు ఖర్చు చేశా. ఎంతకూ తగ్గకపోవడంతో పెద్దాసుపత్రికి వచ్చా. రక్త పరీక్ష చేసి.. వైద్యులు చూసి మందులు ఇచ్చారు. జ్వరం తగ్గింది. ఒళ్లు నొప్పులు ఇంకా ఉన్నాయి. - వజ్రమ్మ, పాయకాపురం, విజయవాడ

సీజ‌న‌ల్ వ్యాధుల ప‌టిష్ట నియంత్రణ‌కు అధికారులు చర్యలు తీసుకోవాలి : మంత్రి స‌త్యకుమార్ - Minister Review Seasonal Diseases

విజయవాడలోని జీజీహెచ్‌కు వచ్చే వారిలో అధిక శాతం మంది ప్రజలు సమీప పీహెచ్‌సీలకు వెళ్లకుండా నేరుగా అక్కడికే వస్తున్నారు. సీనియర్‌ ఆర్‌ఎంపీలు నాలుగైదు రోజులకు రూ.1000 వసూలు చేస్తున్నారు. ఇందులోనే మందులు, వైద్యం ఖర్చులు, నీరసంగా ఉంటే సెలైన్‌ బాటిల్స్‌ కలిపి వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు వైరల్‌ జ్వరాల నిమిత్తం పరీక్షలకు 420 మందికిపైగా రోగులు జీజీహెచ్​కు వస్తున్నారు. వారిలో 144 మందికిపైగా పాజిటివ్‌గా తేలడంతో వంద మందికిపైగా రోగులు ఆసుపత్రిలో చేరుతున్నారు.

వాతావరణ మార్పులతో అధికంగా వైరల్, మలేరియా, డెంగీ వస్తున్నాయి. ముఖ్యంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన మంచి నీరే తాగాలి. జ్వరం మొదటి దశలో ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే మలేరియా, డెంగీలా మారవు. జిల్లా వైద్యాధికారుల ఆదేశాలతో ఇప్పటికే శుభ్రత, మంచినీటిపై అవగాహన కల్పిస్తున్నాం. - వంశీలాల్‌ రాథోడ్, ప్రభుత్వ డాక్టర్​.

విజయవాడలో ఉన్న రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులను పరిశీలించగా ఒక్కో ఆసుపత్రికి సుమారు 150 మందికిపైగా జ్వర పీడితులు వచ్చారు. జ్వరం తీవ్రత మేరకు ఒక్కొక్కరికీ వేలల్లో ఖర్చయిందని ఓ బాధితుడు తెలిపారు. ప్రభుత్వ ఆసుప్రతికి వెళితే తగ్గుతుందో లేదో అని ప్రైవేట్‌ ఆసుపత్రికి పరుగులు తీస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.

అన్ని అవయవాలపై ప్రభావం - మాయదారి జ్వరంతో జనం బెంబేలు - Viral Fevers Spreading in AP

ABOUT THE AUTHOR

...view details