People Suffer Due to Damaged Bridge in Anantapur District : గత ఐదేళ్లలో చిన్నపాటి మరమ్మతులు చేయాల్సిన వంతెనల నిర్వహణ గాలికివదిలేయటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక చోట్ల వంతెనలు కూలిపోయాయి. ముదిగుబ్బ మండలంలో 20గ్రామాలను జాతీయ రహదారికి అనుసంధానం చేసే మద్దిలేరువాగువంతెన 2021లో కూలిపోయింది. తాత్కాలిక మరమ్మతుల చేశామంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మమ అనిపించింది. గతేడాది చివర్లో వంతెన పునర్నిర్మాణం పేరిట నిధులు విడుదల చేసి గుత్తేదారుకు పనులు అప్పగించినా పూర్తికాలేదు. దీంతో వంతెనపై ప్రమాదకరంగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.
వంతెనల నిర్వాహణ జగన్ సర్కారు జాప్యం : శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లి సమీపంలోని మద్దిలేరువాగు వంతెన ప్రమాదకరంగా మారింది. 20 గ్రామాలను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తున్న రోడ్డు 2021 నవంబర్‌లో భారీ వరద ప్రవాహానికి కుప్పకూలిపోయింది. ఈ వంతెనకు సంబంధించిన పిల్లర్లు, బీమ్స్ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై ప్రజలు తీవ్ర ఒత్తిడి తీసుకురావటంతో కొట్టుకుపోయిన వంతెన భాగంలో మట్టిపోసి తాత్కాలికంగా రాకపోకలు పునరుద్ధరించారు. రెండు సంవత్సరాల పాటు ప్రజలు అధికారులు చుట్టూ తిరగటంతో తప్పని పరిస్థితిలో ప్రభుత్వం వంతెన పునర్నిమాణానికి రూ.2 కోట్ల మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి గుత్తేదారును ఎంపిక చేసి గడువులోపు పనులు పూర్తిచేయలేదంటూ కాంట్రాక్ట్ రద్దు చేశారు. రీటెండరింగ్ పిలవటంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాప్యం చేసింది. ఎన్నికల కోడ్ రావటంతో వంతెనకు సంబంధించిన దస్త్రం మూలనపడింది. నిత్యం ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.