Cold Effect on AP : రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రివేళల్లో అయితే చలికి రోడ్లపై జనసంచారం తగ్గింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలను గడగడలాడిస్తోంది. కొన్ని జిల్లాల్లో రెండు రోజులుగా చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. శనివారం రాత్రి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుంతలాంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 5.7 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అదే జిల్లాలోని జిల్లాలోని జి.మాడుగులలో 6.2, డుంబ్రిగుడలో 7.9 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆ జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల లోపే పడిపోయాయి. శ్రీకాకుళం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, విజయనగరం, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, కాకినాడ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తగ్గాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Cold Wave Hits in AP :మరోవైపు వాతావరణం ఒక్కసారిగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా ముఖానికి మంకీ క్యాప్, మఫ్లర్ వంటివి ధరించాలని చెబుతున్నారు. చలికాలంలో వృద్ధులు, శ్వాసకోస వ్యాధులతో ఇబ్బందులు పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. రక్తపోటు, హృద్రోగ బాధితులు తమ ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు వివరిస్తున్నారు.