People Ready to vote in AP : రాష్ట్రం వెలగాలి అంటే ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగానే జనం రాజ్యాంగ పండుగకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రా ఓటర్లు సైతం ఓటెత్తేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రానుండడంతో రైళ్లు, బస్సులు సరిపోవడం లేదు. ఐనా సరై ఏలాగైనా వస్తాం, సరైన ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటూ ప్రతిన బూనారు.
People Move From Hyderabad to AP : రాష్ట్రంలో సోమవారం ( మే 13న) జరగనున్న సార్వత్రిక సమరానికి ప్రజలు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో రాష్ట్రానికి వచ్చేందుకు జనం సిద్ధమయ్యారు. రాష్ట్రానికి వచ్చే బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేకుండా అన్ని బస్సులు ఫుల్ అయిపోయాయి. ఈ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అడ్డగోలుగా ఛార్జీలు పెంచేశారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రైవేటు స్లీపర్ బస్సు టికెట్ ధర ప్రస్తుతం 4 వేల రూపాయలు ఉందని ప్రజలు వాపోతున్నారు. రద్దీకి తగ్గ విధంగా మరిన్ని బస్సులు కేటాయించాలని కోరుతున్నారు.
"ఏపీలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి తప్పకుండా వెళ్తున్నాము. రైళ్లు, బస్సులు పూర్తిగా నిండిపోయాయి. ప్రైవేటు వాహనంలో వెళ్లి అయిన తప్పకుండా ఓటు వేస్తాం. మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటు హక్కును వినియోగించుకోవాలి. రైళ్లు, బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది " -ఓటర్లు