BETTING WITH PIGEONS :రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి అప్పుడే కనిపిస్తోంది. సంక్రాంతి సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోడి పందేలకు పుంజులు సిద్ధంగా ఉన్నాయి. పెంపకందారులు వీటికి ప్రత్యేక ఆహారంతో పాటు శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తుండగా లక్షల్లో ధర పలుకుతున్నాయి. సంక్రాంతి పందేల్లో కేవలం కోళ్ల విక్రయాల ద్వారానే రూ.25కోట్ల వ్యాపారం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా, పందెం రాయుళ్లు పుంజులతోనే కాకుండా పక్షులను సైతం రంగంలోకి దించారు. పావురాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి లక్షల్లో బెట్టింగ్ నడుపుతున్నారు.
ఏపీలో ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి ఎక్కువగా కనిపిస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలకు తోడు సంక్రాంతికి వందల రకాల వంటకాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇక కోడి పందేల బరులకు పంట భూముల్లో ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో పందెం రాయుళ్లను ఆకట్టుకునేలా పుంజుల పెంపకందారులు వాటిని సిద్ధం చేస్తున్నారు. కోళ్ల పందేలు (బరులు) ఎక్కువగా ఆయిల్‌పాం తోటలు, గ్రామ శివారు ప్రాంతాల్లోని మైదానాల్లో జరుగుతుంటాయి. రంగు, జాతి, ఎత్తు, బరువు ఆధారంగా ఒక్కో కోడిపుంజు రూ.25 వేల నుంచి రూ.3 లక్షల వరకు వాటి ధర పలుకుతుంది. సంక్రాంతి కల్లా వీటి అమ్మకాలు రూ.25 కోట్ల పైమాటే అని తెలుస్తోంది.
"కొక్కొరొకో!" తగ్గేదేలే అంటున్న పందెం కోళ్ల ధర - ఒక్కో పుంజు ధర తెలిస్తే షాక్!
పందేల్లో పాల్గొనే నెమలి, అబ్రాస్, పింగళ, పర్ల, మైల, డేగ, పచ్చకాకి, కొక్కిరాయి, రసంగి, సీతువ జాతులకు చెందిన పుంజులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇవన్నీ దాదాపు రెండేళ్ల వయసున్నవే కాగా, వాటికి ఆహారంగా గుడ్లు, బాదంపప్పు, మటన్, జీడిపప్పు, రాగులు, సజ్జలు అందిస్తారు. బరువు పెరిగి తొందరగా అలిసిపోకుండా నీళ్లలో విడిచి ఈత కొట్టిస్తారు. తక్కువ ఆహారంలో ఎక్కువ పోషకాలు అందించడంతో పాటు బికాంప్లెక్స్ మాత్రలు నీళ్లలో కలిపి పట్టిస్తారు. పొగరు పెరగడానికి అశ్వగంధ పొడి, నిత్యం గోరు వెచ్చని తాగునీరు, వేడి నీళ్లతో స్నానాలు చేయించి సిద్ధం చేస్తారు.
ఇలా ఎంతో శ్రద్ధగా పెచిన పందెం కోళ్లను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతుండగా దేశ, విదేశాల్లో స్థిర పడిన తెలుగు వారు పండుగ సందడి కోసం అడ్వాన్స్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం పందెం కోళ్లకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్న పరిస్థితి నెలకొంది. మూడు రోజుల ఉత్సవాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కోట్లు చేతులు మారే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు. కేవలం కోళ్ల విక్రయాలే రూ.25 కోట్ల దాకా ఉంటాయంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ కాదు.