Traffic Problems in Telangana : మహబూబ్‌నగర్‌లో అప్పనపల్లి నుంచి బండమీదిపల్లి వరకూ కోదాడ-రాయచూరు జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ దారిలో గడియారం కూడలి, మార్కెట్ రోడ్డు వద్ద నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం ఉద్యోగాలకు వెళ్లే వేళ, సాయంత్రం జనం ఇంటికి తిరిగి వచ్చే సమయం, పాఠశాలలు, కళాశాలలు వదిలే వేళల్లో వాహనాలు కిక్కిరిసిపోతాయి. రద్దీ అధికంగా మారడంతో నిత్యం రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూడళ్లు వాహనాలతో నిండి రాకపోకలు ఆలస్యమవుతోందని, ట్రాఫిక్ నియంత్రించేందుకు ఎక్కడా సిగ్నల్స్ లేవని ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నియంత్రిస్తున్నా, ఆ చర్యలు ఏ మాత్రం చాలడంలేదని వాహనదారులు వాపోతున్నారు. ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడానికి సిగ్నల్స్ మాత్రమే కాదు, మరిన్ని కారణాలున్నాయి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పేరుకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినా వాటిని ఎవరూ వినియోగించడం లేదు.
'ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలను స్కూల్కు తీసుకెళ్లేటప్పుడు ఇబ్బందులకు గురవుతున్నాం. సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా వాహనాలు రోడ్లపై పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలి'- స్థానికులు
దీంతో వాహనాల్ని రోడ్డుమీదే ఆపడంతో ట్రాఫిక్కు ఇబ్బంది ఏర్పడుతోంది. నిబంధనలు పాటించకుండా దూరాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. గడియారం కూడలి, మార్కెట్ రోడ్డు లాంటి వ్యాపార కేంద్రాలకు వెళ్లేందుకు, వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవని వాహనదారులు వాపోతున్నారు.