తెలంగాణ

telangana

ETV Bharat / state

బండి యూటర్న్ చేయాలంటే​ - 4 కిలోమీటర్లు వెళ్లాల్సిందే - NATIONAL HIGHWAY WIDENING WORKS

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ కష్టాలు - కిలోమీటర్‌ దూరానికి 4 కిలోమీటర్లు వెళ్లి యూటర్న్ తీసుకునే పరిస్థితి - పుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు లేక ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్డు దాటుతున్న జనం

Hyderabad Vijayawada NH Expansion People facing difficulties
Hyderabad Vijayawada NH Expansion People facing difficulties (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2025, 4:45 PM IST

Hyderabad Vijayawada NH ExpansionPeople Facing Difficulties :ఉదయాన్నే పాల ప్యాకెట్‌ కొనాలంటే నాలుగు అడుగులేసి రోడ్డు పక్కనున్న దుకాణానికి వెళ్తే సరిపోతుంది. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆ నాలుగు అడుగుల దూరం కాస్తా నాలుగు కిలోమీటర్లయితే! అయ్య బాబోయ్! అనక తప్పదు. అచ్చం అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీవాసులు. అస్తవ్యస్థంగా సాగుతున్న రోడ్డు విస్తరణ పనులు ఇరువైపులా గ్రిల్స్ ఏర్పాటు, యూటర్న్ తొలగింపుతో విలువైన సమయం, ఇంధనం వృథా అవుతోంది.

హైదారాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులతో ప్రయాణికులు, వాహనదారులు పడుతున్న కష్టాలివి! హైవే పూర్తయితే రయ్‌ రయ్​మని దూసుకెళ్లవచ్చని అనుకున్నారు. ఈ సౌలభ్యం మాట అటుంచితే కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. వనస్థలిపురం నుంచి అవుటర్‌ రింగ్‌రోడ్డు వరకు రోడ్డు పనులు అస్తవ్యస్తంగా జరుగుతుండటంతో ఇరువైపులా ఉన్న వందలాది కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులైతే కిలోమీటర్‌ దూరానికి నాలుగు కిలోమీటర్లు వెళ్తే కానీ యూటర్న్ తీసుకోలేని పరిస్థితి.

ప్రాణాలకు తెగించి రోడ్డు దాటాల్సిన పరిస్థితి :విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు ఇలా ఎంతో మంది రోజూవారీగా ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. అయితే తాము దిగిన చోటు నుంచి అవతలి వైపు వెళ్లాలంటే కనీసం నాలుగు కిలోమీటర్ల దూరం నడవాలి. లేదంటే ప్రాణాలకు తెగించి రోడ్డు దాటాల్సిందే. ఈ క్రమంలో ఎంతో మంది ప్రమాదాల బారినపడుతున్నారు. గతంలో హయత్‌నగర్‌ వర్డ్ అండ్ డీడ్ పాఠశాల నుంచి వనస్థలిపురం, సుష్మా వరకు 10 చోట్ల యూ టర్న్‌లు ఉండేవి. ప్రస్తుతం రెండు మాత్రమే అందుబాటులో ఉంచి మిగతా వాటిని మూసివేశారు. ఒకటి ఆటోనగర్ వద్ద మరోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హయత్‌నగర్ పోలీసుస్టేషన్ వద్ద తెరిచారు. దీంతో ఇటు ఉన్న వారు రోడ్డుకు అటు వైపునకు వెళ్లాలంటే సుమారు మూడు కిలోమీటర్లు దూరం వెళ్లక తప్పడం లేదు.

గ్రిల్స్​ వేయడంతో మూసుకుపోయిన రోడ్డు మార్గం :రహదారిపైకి ఇతరులు రాకుండా ఇటీవల రోడ్డుకు ఇరువైపులా సర్వీసు రోడ్డును ఆనుకొని గ్రిల్స్‌తో పాటు మధ్యలో డివైడర్ పై ఇనుప రాడ్లు ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ రహదారిపై సమస్య మరింత జటిలంగా మారింది. భాగ్యలత కాలనీ, లెక్చరర్స్ కాలనీ, వినాయకనగర్ కాలనీ, బాలాజీనగర్, హైకోర్టుకాలనీ చుట్టూ ఉన్న చాలా కాలనీ ప్రజలు రోజూ జాతీయ రహదారిపైకి వచ్చి బస్సులు ఎక్కి వెళ్తుంటారు. జాతీయ రహదారికి గ్రిల్స్ వేయడంతో రోడ్డు మార్గం పూర్తిగా మూసుకుపోయింది. అయితే భాగ్యలత బస్టాప్ వద్ద మాత్రం ఒక మీటర్ వరకు గ్రిల్స్ వేయకుండా వదిలేశారు. దీంతో హైకోర్టు కాలనీ, భాగ్యలత, ఆర్టీసీ బస్ డిపో, తొర్రూరు ఎక్స్ రోడ్డు వద్ద గ్రిల్స్‌ను ఎక్కి ప్రధాన రోడ్డును దాటుతున్నారు. అలాగే హయత్ నగర్ కృష్ణవేణి ఆస్పత్రి ఎదుట ఒక వైపు జాతీయ రహదారి ప్రధాన రోడ్డును నిర్మిస్తున్నారు. గత మూడు రోజులుగా రోడ్డును తవ్వి కొత్త రోడ్డు వేస్తున్నారు. దీంతో ఒకవైపే వాహనాల రాకపోకలకు సాగుతున్నాయి.

పుట్ ఓవర్ బ్రిడ్జ్​లు నిర్మించాల్సినా :రోడ్డు విస్తరణ చేయడంతో పాటు సర్వీస్ రోడ్లను గ్రిల్స్​తో మూసివేసినప్పుడు ప్రజలకు అసౌకర్యం కలగకుండా అక్కడక్కడ పుట్ ఓవర్ బ్రిడ్జ్ లు నిర్మించాల్సి ఉంది. కానీ ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. డివైడర్ మధ్యలో ఇనుప రాడ్డును బిగించారు. దాంతో ప్రయాణికులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లలేక నానా హైరానా పడుతున్నారు. రోడ్డు విస్తరణ, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఫోన్‌లో ఈటీవీ వివరణ కోరగా విస్తరణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, తొందరలోనే పూర్తవుతాయని తెలిపారు. అయితే పుట్ ఓవర్ బ్రిడ్జిలకు ఇంకా అనుమతులు రాలేదని, అలాగే పనామా, హయత్ నగర్ పైవంతెనల నిర్మాణానికి సంబంధించి అనుమతులు రావాల్సి ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ - ఈ రూట్‌లలో నాలుగు, ఆరు లైన్లకు గ్రీన్ సిగ్నల్

'6 వరుసలుగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి - అప్పటి నుంచే పనులు ప్రారంభం'

ABOUT THE AUTHOR

...view details