People Requesting Boat Facility to Parnasala For Short Trip :ఒక చోటుకు వెళ్లడానికి రోడ్డు మార్గం, నది మార్గం ఉంటే ఎక్కువగా నీటిలో ప్రయాణించేలా పడవ ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు. పైగా పడవలో వెళ్తే సమయం ఆదా అవుతుందంటే ఎవరు కాదంటారు చెప్పండి. అందరూ పడవలోనే వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే పర్ణశాలకు వెళ్లేందుకు భక్తులు, ప్రజలు పడవ ప్రయాణాన్ని కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పర్ణశాలకు పడవ ప్రయాణం చాలా సులువు. రోడ్డు మార్గం కంటే మణుగూరు నుంచి గోదావరి నదిపై పడవపై వెళ్తే చాలా దగ్గర. ఇప్పటి చాలామంది మణుగూరులోని రాయిగూడెం నుంచి పర్ణశాలకు పడవలపై వెళ్తున్నారు.
15 నిమిషాల్లో పర్ణశాలకు : ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గోదావరి నదిపై పడవ ప్రయాణం చేస్తూ పర్ణశాలకు వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుందని భక్తులు అంటున్నారు. పర్ణశాలకు వెళ్లేందుకు మణుగూరు గోదావరి నది వద్ద పడవ ప్రయాణం అవకాశాలు కల్పించాలంటూ స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. పడవ ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య పెరగటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుంది. మణుగూరులోని రాయిగూడెం నుంచి పర్ణశాలకు పడవై కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గం ద్వారా అయితే దాదాపు గంటన్నర సమయం పడుతుంది.