Pawan Kalyan on Olive Ridley Tortoise Dead :కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది.
ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణం అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వన్య ప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ,హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చిరంజీవి చౌధురిని ఆదేశించారు.
కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం :కాకినాడ వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు విడుదల విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. శనివారం ఉదయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ శ్రీ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శ్రీ శంకరరావుతో ఫోన్లో మాట్లాడారు. యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో? లేదో? పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.