Pawan Kalyan Nomination in Pitapuram : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలకు బలమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అంతకుముందు గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన ఇంటి నుంచి పవన్ భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. యువకులు జనసైనికులు, టీడీపీ, బీజేపీ శ్రేణులు భారీగా జనసేనాని ర్యాలీలో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో జనం పోటెత్తారు. మండుటెండనూ లెక్కచేయకుండా అడుగడుగునా పవన్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. సాయిబాబా గుడి వద్దకు చేరుకోగానే నామినేషన్‌కు సమయం మించిపోతుండటంతో ర్యాలీని మధ్యలో ఆపిన పవన్ అక్కడ నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ ర్యాలీలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి వర్మ, పవన్ సోదరుడు నాగబాబు, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ల జోరు, ప్రచార హోరు - పిఠాపురంలో జనసైనికుల సందడి - Political Nominations in Ap 2024
AP Election Nominations 2024 : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరూ ముందుగా నామినేషన్ దాఖలు చేయాల్సిందే. తమ ఆస్తుల పూర్తి వివరాలు, తమపై నమోదైన కేసులను అందులో వెల్లడించక తప్పదు. ఈ నేపథ్యంలో వేల కోట్లు స్థిర, చరాస్థులు కలిగిన పలువురు అభ్యర్థుల ఆస్తుల వివరాలు తెలిసి ఓటర్లు అవాక్కవుతున్నారు. ఇదిలా ఉండగా, కూటమి అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల కమిషన్‌కు నివేదించారు.