Sankranti Kodi Pandelu in AP : సంక్రాంతి వేళ బరుల్లో కాలు దువ్వేందుకు కోడి పుంజులు సిద్ధమయ్యాయి. ఏటా కోట్లలో చేతులు మారే ఈ పందేల కోసం శ్రద్ధ తీసుకుని మరీ పుంజులను పెంచుతారు. ప్రత్యేక ఆహారం, శిక్షణ సరేసరి. పోలీసుల హెచ్చరికలు ఉన్నా సంక్రాంతి అంటే కోడిపందాలే అనేలా ఈసారీ పుంజులను పెంపకందారులు సిద్ధం చేశారు.
సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేవి గోదావరి జిల్లాలే. ముఖ్యంగా కోడి పందేల హడావుడే ఎక్కువ. అందుకే డిమాండ్ దృష్ట్యా పందెం కోళ్ల పెంపకం ఏటికేడు పెరుగుతూ వస్తోంది. స్థానికుల కన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారే ఎక్కువగా పందేల్లో పాల్గొనడం, వేలు, లక్షల్లో పందేలు వేస్తుండటంతో పండుగ రోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారతాయి. దీంతో పందేల్లో ప్రధానమైన కోడి పుంజులను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ పెంచుతున్నారు.
కోడిపందేలు, రికార్డింగ్ డాన్సులు - ఎక్కడెక్కడ ఏమేం స్పెషల్ అంటే!
400కి పైగా కోడి పుంజుల కేంద్రాలు:ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో దాదాపు 400కి పైగా కోడి పుంజుల పెంపకం కేంద్రాలు ఉన్నాయంటే పందేలు ఏ స్థాయిలో జరుగుతాయో ఊహించుకోవచ్చు. ఆయిల్ పామ్ తోటలు మొదలు, చెరువు గట్లు, పొలాల్లో కోళ్ల పెంపకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. పందెం రాయుళ్లు పెంపకందారులతో ముందుగానే ఒప్పందం చేసుకుని మరీ ప్రత్యేకంగా కోళ్లను పెంచుతుండగా ఇప్పటికే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు కోళ్ల కొనుగోళ్ల చేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. పోరాటం చేసే విధానం, పుంజు రంగు, ఎత్తు, పుంజు బ్రీడ్‌ను బట్టి ఒక్కో పుంజు ధర రూ.25 వేల నుంచి 3 లక్షల వరకు పలుకుతోంది. పండుగ రోజుల్లో వీటి అమ్మకాల రూపంలోనే దాదాపు రూ.25 కోట్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం.