Show Cause Notices in Chilakaluripet Police : పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొన్నారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చిలకలూరిపేట టౌన్, రూరల్ సీఐలు సుబ్బనాయుడు, రమేష్, ఎస్సైలు అనిల్‌కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు మెమోలు జారీ చేశారు. చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్‌ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు.
అసలేం జరిగిదంటే : మంగళవారం నాడు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య ప్రత్తిపాటి వెంకటకుమారి పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నేతలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని సీఐలు, ఎస్సైలు హాజరయ్యారు. అంతటితో ఆగకుండా కేక్ తెచ్చి కట్ చేయించి మరి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలను ఎమ్మెల్యే కార్యక్రమాలు తెలియజేసే వాట్సప్ గ్రూపులో షేర్ చేశారు. వెంకటకుమారి ప్రజాప్రతినిధి కాకపోయినా చట్టపరంగా ఎలాంటి పదవి లేకపోయినా పోలీసులు హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం కాస్త ఎస్పీ దృష్టికి రావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.
Chandrababu Warns to MLAs :మరోవైపు బుధవారం నాడు నిర్వహించిన కేబినెట్ భేటీలో చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు మంత్రులు, శాసనసభ్యులు, వారి కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతుండడం, అధికారదర్పం ప్రదర్శించడంపై సీఎం మండిపడ్డారు . అలాంటివి సహించేది లేదని హెచ్చరించారు. ఎంతో కష్టపడి, ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు బుల్డోజర్లు, పొక్లెయిన్‌లతో కూల్చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు.