PAC Chairman Election: పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయించింది. పీఏసీ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి వచ్చారు. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రతిపక్షపార్టీ సభ్యుడికి పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్న ప్రక్రియ. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పీఏసీ ఛైర్మన్ ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పీఏసీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
MLA Peddireddy Filed Nomination: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా తంబాళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకానాథ్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం తర్వాత 11 మంది వైసీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తున్నారు. పీఏసీ కావాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి రావడం గమనార్హం.
వైఎస్సార్సీపీకి కష్టమేనా: పీఏసీ సభ్యత్వానికి ఎన్డీఏ తరఫున 9 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. 9 నామినేషన్లు మాత్రమే దాఖలైతే పీఏసీ ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం అయ్యేది. అయితే పీఏసీలో ఉండాల్సిన సభ్యుల కంటే ఒక నామినేషన్ ఎక్కువగా దాఖలు కావడంతో, పీఏసీ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్డీఏ నుంచి 9, వైఎస్సార్సీపీ నుంచి ఒకటి కలిపి మొత్తం 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒక్కో పీఏసీ సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ప్రస్తుతం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు.
"ఎన్నికల్లో పోటీకే భయపడే పరిస్థితి" - ఘోర పరాభవాన్ని మర్చిపోలేకపోతున్న వైఎస్సార్సీపీ