Bail to OU JAC Leaders in Allu Arjun House Attack Case : అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన కేసులో అరెస్టయిన ఓయూ జేఏసీ నాయకులకు బెయిల్ మంజూరైంది. ఈ నెల 22న అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళన చేసిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, వనస్థలిపురం కమలానగర్‌లో ఉన్న న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. ఒక్కొక్కరు రూ.పది వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదు :అల్లు అర్జున్ ఇంటి వద్ద దాడి ఘటనపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు సినీనటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టు ఉందని, చట్టం తన పని తాను చేసుకునిపోతుందంటూ వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే : ఈ నెల 22న సాయంత్రం అల్లు అర్జున్ నివాసం వద్దకు ఓయూ ఐకాస నాయకులు చేరుకుని ఇంటి ఆవరణలోని టమాటాలు విసిరి.. పూలకుండీలు ధ్వంసం చేసి ఆందోళన చేశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకున్న ఐకాస అధికార ప్రతినిధి బోనాల నాగేశ్ మాదిగ, ఛైర్మన్ రెడ్డిశ్రీను ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజుగౌడ్, కన్వీనర్ పి.ప్రకాశ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి బుద్దా ప్రేమ్‌కుమార్‌గౌడ్, నాయకుడు సి.మోహన్, పి.ప్రకాశ్ తదితరులు ప్లకార్డులు పట్టుకొని అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.