Software Engineers Turned Into A Farmer : ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగం చేస్తూనే మరోవైపు సేంద్రియ వ్యవసాయానికి నడుంబిగించారు ఈ యువకులు. ఆలోచన బాగానే ఉన్నా మొదట్లో అనేక ఒడిదొడుకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడిచారు. సేంద్రీయ కూరగాయలకు మార్కెట్‌లో మంచి స్పందన రావడంతో ఇక వెనక్కి తిరగకుండా సాగులో దూసుకెళ్తున్నారీ యువత.
ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించాలని :హైదరాబాద్‌కు చెందిన ఈ ఐదుగురు చిన్ననాటి స్నేహితులు. అందరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నా ఎక్కడో ఏదో వెలితి వీరిని ఆలోచింపజేసింది. ప్రస్తుతం ప్రతిదీ కలుషితం అవుతోంది. ముఖ్యంగా పురుగుల మందులతో ఆహారం విషంగా మారుతుందని చింతించారు. పూర్తి స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం చేసి కూరగాయలను పండించాలని సంకల్పించారు ఈ ఔత్సాహికులు.
వీరిలో ఎంబీఏ పూర్తి చేసిన రమేశ్ ఓ విత్తన శుద్ధి కర్మాగారంలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నాడు. ఇతనిది వ్యవసాయ కుటుంబం కావడంతో రైతులను కలుస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ పండించే విధానంపై అధ్యయనం చేశాడు. సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండించడం వల్ల నలుగురికి మేలు జరుగుతుందని భావించాడు. ఇదే విషయాన్ని స్నేహితులకు తెలిపాడు.
సేంద్రీయ ఎరువులను మాత్రమే వాడుతూ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని నందనంలో 7 ఎకరాల భూమిని లీజ్‌కు తీసుకున్నారు. సుమారు 15 లక్షల రూపాయలు వెచ్చించి భూమిని చదును చేసి సాగు యోగ్యంగా తయారు చేశారు. సేంద్రీయ పద్ధతిలో బీర, కాకర, సొర, టమాట, వంకాయ, బెండ, బీన్స్‌తోపాటు గోంగూర, కొత్తమీరు, పాలకూర, బంతిపూలు సాగు చేస్తున్నారు.
పంట బలం కోసం జీవామృతం, ఆవు మూత్రం, ఆవు పేడ, వేస్ట్ కంపోస్ట్, అగ్ని అస్త్రం, వేప నూనె వాడుతున్నారు. చీడపీడలను బట్టి ఆయా సేంద్రీయ ఎరువు వాడతారు. ఆ ఎరువులను కూడా తామే స్వయంగా తయారు చేస్తున్నామని అందుకోసం రెండు ఆవులను, కోళ్లను పెంచుతున్నామని చెబుతున్నారు. తద్వారా ఇటు వ్యాపార పరంగా అటూ మంచి ఆహార పదార్థాలు అందిస్తున్నామన్న సంతృప్తి తమకు ఉందని అంటున్నారు.