Leopard Tension in Rajahmundry :రాజమహేంద్రవరం దివాన్ చెరువు ప్రాంతంలో గత తొమ్మిది రోజులుగా చిరుత సంచారం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ట్రాప్ కెమెరా కంటబడ్డ చిరుత ఆదివారం నాడు మరోసారి తిరుగుతూ కనిపించింది. మరోవైపు దానిని ఏలాగైనా పట్టుకునేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నారు. థర్మల్ డ్రోన్ కెమెరాల సహాయంతోనూ వెతుకుతున్నారు.
భయాందోళనలో స్థానికులు :దీంతో చిరుత ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నరు. హౌసింగ్‌బోర్డు కాలనీ, అటోనగర్, దివాన్ చెరువు తదితర ప్రాంతాల ప్రజలు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే చిరుత సంచారం పట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం ఆరు దాటిన తర్వాత బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు చిరుతను పట్టుకునేందుకు 50 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. థర్మల్ డ్రోన్ కెమెరాల సాయంతో దానిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాతీయ రహదారిపై ఆటోనగర్ నుంచి లాలా చెరువు హౌసింగ్ బోర్డు వరకు వాహనదారులు చిరుత కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జాతీయ రహదారిపై స్పీన్లిమిట్ బోర్డులు సైతం ఏర్పాటు చేశామని వెల్లడించారు. రోడ్డుకి ఇరువైపులా గమనిస్తూ నెమ్మదిగా వెళ్లాలని అధికారులు పేర్కొన్నారు.