నెల్లూరు జిల్లాలో కోటి విలువైన మద్యం డంప్ - వైసీపీ నాయకుడికి చెందినదేనా? One Crore Worth Liquor Seized in Nellore District: నెల్లూరు జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం డంప్‌లు బయట పడుతున్నాయి. ఎన్నికలు కోసం వైసీపీ నాయకులు రెండు నెలలుగా రైస్ మిల్లులు, గోడౌన్లలో భారీగా మద్యం నిల్వలను దాచి ఉంచారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం అల్లూరులో అధికార పార్టీకి చెందినట్లుగా భావిస్తున్న భారీ మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వైసీపీ నాయకుడు సురేంద్ర రెడ్డితో పాటు మరికొందరు అల్లూరులో కోటి రూపాయలు విలువైన 1200 కేసుల మద్యాన్ని నిల్వ చేసినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. భారీగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు, దీని వెనక ఎవరున్నారో దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
అదే విధంగా పొదలకూరు మండలం విరువూరులో కాకాణి అనుచరుడు చిర్రా రాజగోపాల్ రెడ్డి రైస్ మిల్లులో మద్యం నిల్వలను సెబ్ అధికారులు గుర్తించారు. నాలుగు లక్షల రూపాయలు విలువ కలిగిన 2069 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పసుపులేటి పెంచలయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మంత్రి కాకాణి అనుచరుడి దగ్గర పట్టుబడ్డ మద్యం డంప్ - సర్వేపల్లిలో లక్ష సీసాల లిక్కర్ ! - Liquor Bottles At YSRCP Leaders
ముత్తుకూరు మండలం పంటపాలెంలో నాలుగు రోజుల కిందట 4,232 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డికి సంబంధించినవిగా గుర్తించారు. మారు సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.
అయితే మామాలుగా ఒకరి వద్ద మూడుకు మించి మద్యం సీసాలు ఉండటం నేరం. అలాంటిది వైసీపీ నేతల వద్దకు అన్ని వేల మద్యం సీసాలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా నెల్లూరు జిల్లాలో నకిలీ మద్యం తయారు అవుతుందనే అనుమానాలు సైతం ఉన్నాయి.
2014 ఎన్నికల్లో సర్వేపల్లి, కావలి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కల్తీ మద్యం తయారు చేశారు. తాగి ఏడుగురు మృతి చెందారు. పలువురుతీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఈ వ్యవహారంలో అప్పట్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు ప్రస్తుత కావలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, అదే విధంగా పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దొరికిన మద్యం డంపులు కూడా కల్తీ మద్యంగా భావిస్తున్నారు. 2014లో మాదిరిగానే కల్తీ మద్యం తయారు చేసి నకిలీ లేబుళ్లు, హోలోగ్రామ్‌లతో కూడిన సీసాల్లో నింపి వాటిని ప్రస్తుతం ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి సిద్ధం చేశారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
గ్రామ సచివాలయంలో మద్యం బాటిళ్లు- తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకున్న అధికారులు - Liquor Bottles at Sachivalayam