Illegal Construction Demolition in Malkapur : రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులు జోరు కొనసాగిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. మల్కాపూర్‌లో చెరువులోనే బహుళ అంతస్తుల భవనాన్ని కొందరు కట్టినట్లు గ్రామస్థులు గుర్తించారు. ఈ మేరకు విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, బాంబుల ద్వారా అక్రమ కట్టడాలను కూల్చివేశారు. చెరువులో అక్రమ నిర్మాణం ఉండటంతో బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. బాంబులు పేలిన క్రమంలో శిథిలాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలయ్యాయి.
సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 12 సంవత్సరాల క్రితం మల్కాపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు. చెరువు నీళ్లలో అడుగు పెట్టకుండా భవనంలోకి చేరుకునేలా, కొంతదూరం నుంచే మెట్లు కట్టారు. ఈ బహుళ అంతస్తుల భవన యజమాని కుటుంబసభ్యులు వారాంతాల్లో వచ్చి ఇక్కడ సేదతీరుతూ ఉండేవారు.
'ఇదంతా ఎఫ్టీఎల్ ప్రాంతం. ఈ భారీ భవనాన్ని చెరువులోనే నిర్మించారు. దీంతో వారికి నోటీసులు ఇచ్చాం. కూల్చివేతకు సమయం కూడా ఇచ్చాం. ఈ క్రమంలో ఇవాళ బాంబులతో కూల్చివేశాం. చెరువులోకి ఏ వెహికల్స్ వెళ్లేలా లేదు. అందుకే బాంబుల ద్వారా నేలమట్టం చేశాం. బాంబులు పేలిన క్రమంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించాం' - అధికారులు