Prakasam Barrage Operation in Andhra Pradesh : ఏపీలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు అడ్డుపడిన పడవలను నీటిలోనే కత్తిరించి, తొలగించడానికి విశాఖపట్నం నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. బ్యారేజీ, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 120 టన్నుల సామర్థ్యం ఉన్న ఎయిర్ బెలూన్స్ వస్తున్నాయని, బుధవారం సాయంత్రానికే పడవలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. బోట్లను వెలికితీతకు బేకం సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని ఏపీ మంత్రి రామానాయుడు తెలిపారు.
మూడు బోట్లు ఒక దానికొకటి కలిపి కట్టి ఉంచారని, ఒక్క పడవ బరువు 40 టన్నులు ఉందని ఏపీ మంత్రి రామానాయుడు చెప్పారు. మూడూ కలిపి మొత్తం 120 టన్నులుగా బ్యారేజీని ఢీకొట్టేలా పంపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్లు కౌంటర్ వెయిట్స్‌ను కాకుండా, కట్టడాలను తాకి ఉంటే మూడు జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని చెప్పారు. వరదలోనూ రూ.1.50 కోట్ల విలువైన బోట్లకు లంగరు వేసుకోలేదంటేనే ఇది కుట్ర అని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
'కుట్ర పూర్వకంగానే మూడు పడవలను మిక్స్ చేసి 120 టన్నుల బరువున్న పడవలను ప్రకాశం బ్యారేజీలోకి వదిలారు. అధికారం లేదని, జిల్లాలో వాళ్ల పార్టీకి ఒక్క సీటు కూడా లేదని కుట్ర చేశారు'- రామానాయుడు, ఏపీ జలవనరుల శాఖ మంత్రి
ఎలాగైనా భారీ పడవలను బయటకు తీయాలనే లక్ష్యంతో అధికారులు ప్లాన్ బీని సిద్ధం చేశారు. పడవలను ముక్కలుగా కోసి బయటకు తీయడమే మార్గమని నిర్ణయించారు. దీని కోసం విశాఖ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. నదులు, సముద్రాల్లో సైతం దిగి అధునాతన కట్టర్లతో భారీ పడవలను కోసే నైపుణ్యం ఉన్న డైవింగ్ టీంలు రంగంలోకి దిగనున్నాయి. నదిలో పడవల్ని ముక్కలు చేసే పని ప్రారంభించనున్నారు. ఇందుకోసం 120 టన్నుల ఎయిర్ బెలూన్స్ పున్నమి ఘాట్ నుంచి భారీ పంటును సైతం తెస్తున్నారు.
ఎట్టి పరిస్ధితుల్లోనూ సాయంత్రానికే : మూడు ముక్కలు చేశాక వాటిని క్రేన్లు, పంట్ల సాయంతో బ్యారేజీ నుంచి బయటకు తేవాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ సాయంత్రానికి భారీ పడవలను తొలగించాలని భావిస్తున్నారు. పడవలను ముక్కలుగా చేసి బయటకు పంపే ప్రయత్నం నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని ఇంజినీర్లు, అధికారులు ధీమాతో ఉన్నారు. బ్యారేజీ నిర్మాణం, గేట్లు, కౌంటర్ వెయిట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా బోట్లను వెలికి తీస్తామని చెప్తున్నారు.