Officers Check Industries Safety Measures in Anakapalli : పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగస్టు నెలలో ఎసెన్షియా, సినర్జిన్ కంపెనీల్లో జరిగిన వరుస ప్రమాదాలతో కూటమి సర్కారు అప్రమత్తమైంది. పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు పరిశ్రమలను పరిశీలించి ఉన్నత అధికారులతో సమీక్షలు జరిపింది. తాజాగా మిగతా కంపెనీల్లోనూ భద్రత ప్రమాణాల అమలుపై జిల్లా వ్యాప్తంగా హైపవర్ బృందం విస్తృత తనిఖీలకు శ్రీకారం చుట్టింది. 8 శాఖల అధికారులు వారంలో 3 రోజుల పాటు తనిఖీలు చేపట్టాలి.
మావన తప్పిదాల వల్ల ప్రమాదాలు : జిల్లా పరిధిలో సుమారు 200 పైగా రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి అన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి లోపాలు ఉంటే సరిదిద్దాలి. భవిష్యత్తులో ప్రమాదాలు జరకుండా సూచనలు చేయాల్సిన బాద్యతా కమిటీపై ఉంది. పరిశ్రమల్లో భద్రత (Safety Measures) అనేది యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులు సమష్టి కృషితోనే సాధ్యమవుతుంది. పరిశ్రమల్లో యాజమాన్యాలే అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలి. ముఖ్యంగా నిర్ధిష్టమైన పనిచేసే విధానం (SOP) సక్రమంగా అమలుచేయాలి. యంత్ర పరికరాల్లో నాణ్యతా లోపాలు, ఉద్యోగులు, కార్మికులకు సరైన అవగాహన లేకపోవడం, సుశిక్షితులైన వారిని నియమించుకోకపోవడం ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
వాస్తవానికి పరిశ్రమల్లో 98% మావన తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలా జరగకుండా జాగ్రత్త పడటం మన చేతుల్లోనే ఉంది. పక్క కంపెనీలో కదా ప్రమాదం జరిగింది. మాకేం సంబంధం? అని యాజమాన్యం, కార్మికులు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ కంపెనీలో ప్రమాదం ఎందుకు జరిగింది. మన పరిశ్రమలో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అని ఒకసారి పరిశీలించుకోవాలి. అప్పుడే పరిశ్రమల్లో ప్రమాదాలు చర్యలు జరగకుండా అరికట్టవచ్చు.