Number of Women Suffering From Cancer is Increasing Day by Day :క్యాన్సర్ బారిన పడే మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు నెలల నుంచి సంక్రమిత, అసంక్రమిత (ఎన్‌సీడీ 3.0) వ్యాధుల సర్వే కొనసాగుతోంది. నాలుగు లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా 1,765 మంది క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి నిర్ధారణ కోసం వీరికి మరిన్ని పరీక్షలు చేయనున్నారు.
30 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్నారు. జబ్బు తీవ్రమైనప్పుడే ఆసుపత్రులకు వస్తున్నారు. అప్పటికీ పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటింటా వైద్య పరీక్షలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక ఓపీ :క్షేత్రస్థాయిలో క్యాన్సర్ అనుమానిత కేసులను గుర్తించి జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ విభాగానికి పంపిస్తున్నారు. అక్కడ నమూనాలు సేకరిస్తున్నారు. నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేకంగా 222 ఓపీ ఏర్పాటు చేశారు. ఇక్కడ వారంలో మంగళవారం, గురువారం సిబ్బంది అందుబాటులో ఉంటారు. అవసరమైనవారిని కర్నూలు జీజీహెచ్‌లో ప్రత్యేక విభాగానికి పంపిస్తున్నారు. అక్కడ వైద్యులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి చికిత్స ప్రారంభిస్తున్నారు.
చివరి దశలో ఆసుపత్రికి :ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద ఏటా సుమారు 12 వేల మంది మహిళలు క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కర్నూలు సర్వజన వైద్యశాలలోని క్యాన్సర్ యూనిట్ విభాగానికి ప్రతి నెలా రొమ్ము క్యాన్సర్ బాధితులు 10, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారినపడి చికిత్సకు వచ్చేవారు 6 నుంచి 10 మంది ఉంటున్నారు. ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనూ ప్రతి నెలా సుమారు 10 కేసులు వస్తున్నాయి.