Nampally Court Send Notice To Minister Konda Surekha: హీరో నాగార్జున వేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీచేసింది. తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున గత వారం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.
కొండా సురేఖకు నోటీసులు :తనను సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ పార్టీ వారు ట్రోల్ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించడం, వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముఖంగా మాట్లాడడంతో అవి కాస్త హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువునష్టం దావా వేశారు.