South West Monsoons to AP at the Scheduled Time :ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కపోత నుంచి కొంత వరకు ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే వర్షాలు కురుస్తాయని అందరూ భావించారు. కానీ ‘రెమాల్’ తుపాను ఉత్తర దిశగా బంగ్లాదేశ్, బంగాల్ వైపు వెళ్లిపోవడంతో ఆశలు అడియాశలయ్యాయి. కాకినాడ, విజయవాడ నగరాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈ తుఫాను ప్రభావం కనిపించలేదు. అయితే, ఈ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశంపై వాతావరణశాఖ కీలక విషయాలు వెల్లడించింది.
రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు ముందు ప్రి మాన్ సూన్ వాతావరణం ఉందని ఆ ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని విశాఖ వాతావరణ శాఖా అధికారి డాక్టర్ సునంద తెలిపారు. రాష్ట్రంలో రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఉందని, రేమాల్ తుఫాన్ వల్ల నైరుతి పవనాల గమనానికి విఘాతం ఏర్పడ లేదని పేర్కొన్నారు. అనుకున్న సమయానికి రుతు పవనాలు కేరళను, ఆ తరువాత మన రాష్ట్రానికి తాకుతాయని వెల్లడించారు. నైరుతి పలకరించే వరకు తెలుగు రాష్ట్రాలలో ఈ ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సమస్య ఉంటుందని విశాఖ వాతావరణ శాఖాధికారి డాక్టర్ సునంద తెలిపారు.