Telangana Government Hospitals Security Problems : డాక్టర్లను ప్రజల ప్రాణాలు కాపాడే దేవుడని అందరూ నమ్ముతుంటారు. కానీ అలాంటి వారి ప్రాణాలకే భద్రత లేకుండా పోతోంది. దేశంలో సంచలనం రేపిన కోల్‌కతా దురాగతం నేపథ్యంలో మహిళా వైద్యులు, సిబ్బంది భద్రత తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆసుపత్రుల్లో దాడులు, అఘాయిత్యాలు జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా మిగిలిన సందర్భాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత కరవవుతోంది. ఈ పరిస్థితి రాష్ట్రంలోని ప్రముఖ ఆసుపత్రులు సహా చాలా చోట్ల కనిపిస్తోంది.
వైద్యం కోసం ఆసుపత్రులకు నిత్యం వేలాది మంది రోగులు, వారి బంధువులు వస్తుంటారు. కొన్నిసార్లు సంఘ విద్రోహశక్తులు కూడా దవాఖానాల్లో పాగా వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా డాక్టర్లు, సిబ్బంది, జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు, పీజీలు, నర్సింగ్ సిబ్బంది భద్రతపై నీలిమేఘాలు కమ్ముతున్నాయి. వారు విధులు నిర్వర్తించాలన్నా బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి. రాత్రిపూట అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులను నిర్వహించాల్సిన పరిస్థితి వస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి అత్యవసర విభాగం, నిలోఫర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి ఇలా చాలా చోట్ల వైద్యులపై దాడులు జరిగిన ఘటనలు ప్రతిసారి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాగే నమోదు కాని ఘటనలు చాలా మేర ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత కొరవడుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
భద్రత కోసం 2019లో ప్రభుత్వం 8 బోధనాసుపత్రుల్లో 128 ఎస్పీఎఫ్ సిబ్బంది పోస్టులను మంజూరు చేసింది. అలాగే నిజామాబాద్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 36 ఎస్పీఎఫ్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఈ సంఖ్యను పెంచాల్సి ఉన్నా ఉన్న పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. అలాగే ఆసుపత్రుల్లో పోలీసు అవుట్‌పోస్టులను క్రమంగా తొలగిస్తున్నారు. ఉస్మానియాలో 16 మంది ఎస్పీఎఫ్ సిబ్బందికి గానూ కేవలం ఐదుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు అవుట్ పోస్టును మూసేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను ప్రైవేటు సిబ్బందే చూసుకుంటున్నారు. సాధారణంగా సెక్యూరిటీ కోసం ఏజెన్సీలకు బాధ్యత అప్పగిస్తుంటారు. అవి ఎవరో తెలియని వ్యక్తులను ఆసుపత్రులకు భద్రత కోసం పంపిస్తారు. దీంతో విధుల్లో ఉంటున్న వారి వివరాలు తెలియడం లేదు. ఆసుపత్రులకు పంపే సిబ్బంది వివరాలను పోలీసులకు అందించి ఆ తర్వాతనే వారిని విధుల్లో పెట్టాలనే అభిప్రాయాలు ఆసుపత్రి వర్గాల్లో ఉంది. వారు ఆసుపత్రుల్లో తనిఖీలు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని చెబుతున్నారు.
ఆసుపత్రుల్లో సీసీ నిఘా ఏదీ? : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అనేది కేవలం ఎమర్జెన్సీ వార్డులకే పరిమితం అయింది. కానీ ప్రభుత్వం మాత్రం అన్ని చోట్లా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లోని కారిడార్లు, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేవు. వైద్యులు, పురుషులు, స్త్రీలకు ప్రత్యేకంగా విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలి. వాటి బయట కూడా సీసీ కెమెరాలు బిగించాలనే విన్నపాలు వస్తున్నాయి. కానీ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమర్చిన సీసీలు అలంకార ప్రాయంగా మారిపోయాయి. వరంగల్ ఎంజీఎం లాంటి ఆసుపత్రుల్లోనే చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఆదిలాబాద్ రిమ్స్‌లో సుమారు 80 సీసీ కెమెరాలకు గానూ సగం వరకు పనిచేయడం లేదు.
అరాచక శక్తులకు అడ్డాలుగా ప్రభుత్వ ఆసుపత్రులు : పాత ప్రభుత్వ ఆసుపత్రులు అరాచక శక్తులకు అడ్డాలుగా మారుతున్నాయి. రోగుల బంధువుల్లా వచ్చి పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో పాడుబడిన భవనాలు రాత్రి, పగలు కూడా గంజాయి సేవించేవారికి అడ్డాగా మారాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చోరీలు అధికంగా జరుగుతున్నాయి. వైద్యులు, పీజీ విద్యార్థుల సెల్ఫోన్లు చోరీకి గురవతున్నాయి. రోగుల సహాయకుల వస్తువులను కూడా దొంగలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత అనేది ఎంత అవసరమో స్పష్టంగా కనిపిస్తోంది.
కోల్‌కతా ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు - వైద్యసేవలు నిలిపివేసి డాక్టర్ల ఆందోళన - TG doctors protest kolkata incident
బంగాల్ డాక్టర్ హత్యాచార ఘటన- అవన్నీ జరగలేదట! కోల్‌కతా పోలీసుల సంచలన ఫ్యాక్ట్‌చెక్! - Kolkata Doctor Murder Case