బాల్యవివాహం నుంచి బయటపడి కల దిశగా ప్రయాణం- ఇంటర్ ఫలితాల్లో టాప్ మార్కులు సాధించిన బాలిక Girl Escaped Child Marriage and Get Top Marks in Intermediate: చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండేదీ అమ్మాయి. ఎలాగైనా ఉద్యోగం సాధించి తనలాంటి వారికి అండగా నిలవాలనుకుంది. అంతలోనే విధి వెక్కిరించి ఆర్థిక పరిస్థితుల దృష్య్టా చదువు మానేయాల్సి వచ్చింది. కానీ, తన సమస్యను అధికారులతో పంచుకుంది. జిల్లా కలెక్టర్ చొరవతో మళ్లీ బడిబాట పట్టింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 440మార్కులకు గాను 421 సాధించి శభాష్ అనిపించుకుంది.
కర్నూలు జిల్లా మారుమూల ప్రాంతమైన పెద్దహరివనం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, హనుమంతమ్మకు నలుగురు కుమార్తెలు. కుటుంబాన్ని నెట్టుకు రావడమే వీరికి కష్టంగా మారింది. ఎలాగోలా కష్టపడి ముగ్గురు కుమార్తెల వివాహం జరిపించారు. నిర్మలకు మాత్రం బాల్యం నుంచే చదువుకోవడమంటే చాలా ఇష్టం. నిర్మల బాల్యం నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేది.
ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు- గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు
భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి కుటుంబంతో పాటు తనలాంటి పేదవారికి అండగా నిలవాలనుకునేది. అదే ఆశయంతో కష్టపడి చదివి పదో తరగతిలో 537 మార్కులు సాధించి పలువురి ప్రశంసలందుకుంది. అయితే పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఆనందం నిర్మలకు ఎక్కువసేపు ఉండలేదు. కుటుంబ పరిస్థితి బాగోక పోవడంతో నిర్మలకు కూడా పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి అనుకున్నారు తల్లిదండ్రులు.
చదువు మాన్పించి కూలి పనులకు వెళ్లమన్నారు. చేసేదేం లేక ఏడాది పాటు కూలీ పనులకు వెళ్లి కుటుంబానికి అండగా నిలిచింది నిర్మల. ఇంతలోనే చిన్నవయసులోనే పెళ్లి పీటలెక్కాల్సిన పరిస్థితీ రావడంతో ధైర్యంతో ముందడుగు వేసి తన సమస్యను అధికారులతో పంచుకుంది నిర్మల. ఫలితంగా జిల్లా కలెక్టర్ చొరవతో ఆస్పరి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో చేరినట్లు చెబుతోంది. జిల్లా కలెక్టర్ సహకారంతో భవిష్యత్తు అనే పుస్తకాలు మళ్లీ తెరిచింది ఈ విద్యా కుసుమం. లక్ష్యం కోసం అహర్నిశలు కష్టపడి చదివింది.
ఏప్రిల్ 12న వెలువడిన ఇంటర్ ఫలితాలలో 440కి గాను 421 మార్కులు సాధించి ఉపాధ్యాయులు, అధికారులతో ప్రశంసందుకుంటుంది. నిర్మల శ్రమ, పట్టుదలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సవాళ్లు ఎదుర్కొని సమర్థంగా అధిగమించి ఇంటర్ బైపీసీలో 421 మార్కులు సాధించిందని తెలిపింది. తను చదువుకోవడానికి అన్నివిధాలా సహకరించిన జిల్లా కలెక్టర్ సృజనను కృతజ్ఞతలు తెలిపింది.
జీఎంఆర్ ఐటీ వేదికగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు
కలెక్టర్ సహకారంలో నిర్మల బాగా చదువుతోందని ఈ అమ్మాయి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కూడా మంచి మార్కులు సాధిస్తానని నిర్మల అంటోంది. ఐపీఎస్ కావడంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడటమే తన లక్ష్యమని చెబుతోంది ఈ సరస్వతి పుత్రిక.
"నాకు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. కష్టపడి చదివి భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి నా కుటుంబంతో పాటు నాలాంటి పేదవారికి అండగా నిలవాలనుకున్నాను. అదే ఆశయంతో కష్టపడి చదివి పదో తరగతిలో 537 మార్కులు సాధించాను. అయితే కుటుంబ పరిస్థితి బాగోకపోవడంతో చదువు మాన్పించి నన్ను కూలి పనులకు వెళ్లమన్నారు. చేసేదేం లేక ఏడాది పాటు కూలి పనులకు వెళ్లాను. అయితే ఇంతలోనే పెళ్లి పీటలెక్కాల్సిన పరిస్థితీ వచ్చింది. దీంతో ధైర్యంతో ముందడుగు వేసి నా సమస్యను అధికారులతో పంచుకున్నాను. ఫలితంగా జిల్లా కలెక్టర్ చొరవతో నేను ఇంటర్మీడియట్లో చేరి 440కి గాను 421 మార్కులు సాధించాను." - నిర్మల, విద్యార్థిని