Depression Continues in Bay of Bengal: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటలుగా 12 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి ఈశాన్యంగా 480 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 590 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రాగల 12 గంటలపాటు ఇది తూర్పు, ఈశాన్యం దిశగా కదులుతూ వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా సముద్రంలోనే బలహీనపడే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా విశాఖలో స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
సీఎం చంద్రబాబు సమీక్ష: ఉత్తరాంధ్రలో వర్షాలపై సీఎం చంద్రబాబు సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లోని పరిస్థితులను సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లాస్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయమందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని రైతులకు తెలియజేయాలని సూచించారు.
పీఎం రాష్ట్రీయ బాల పురస్కారానికి మంగళగిరి క్రీడాకారిణి జెస్సీరాజ్
లోతట్టు ప్రాంత ప్రాజలను అప్రమత్తం చేయాలి: భారీ వర్షాల సూచన నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్(APEPDCL) అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. వర్షప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. స్తంభాలు, చెట్లు నేలకొరిగితే వెంటనే సహాయచర్యలు చేపట్టాలని నిర్దేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
అన్నదాతలు అష్టకష్టాలు: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఖరీఫ్ సీజన్ పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వరి కుప్పలు సైతం తడిసి పోయాయి. పొలాల్లో నీరు చేరడంతో వరి పంటను చూసి కర్షకులు ఆందోళన చెందుతున్నారు.
సీఐకి ఫోన్ చేసిన సైబర్ నేరస్థులు - డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపు