Minister Nara Lokesh Supporting To Kuwait Gulf Victim : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో దగాపడ్డ వారిని ఆదుకోవడంలో మంత్రి లోకేశ్ తనదైన ముద్ర చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల కాలంలోనే ప్రభుత్వ యంత్రాంగం, టీడీపీ-ఎన్నారై విభాగం నేతల సమన్వయంతో పదుల సంఖ్యలో స్వస్థలాలకు చేర్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.
బాధితులకు అండగా లోకేశ్ : చాలీచాలని ఆదాయాలతో బతుకుభారంగా మారిన కొందరు సగటు జీవులు కష్టాల కడలి నుంచి గట్టేకేందుకు ఎడారి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. అలాంటి వారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు మంత్రి లోకేశ్. ఇబ్బందుల్లో ఉన్నామంటూ బాధితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలు మెరుపువేగంతో స్పందిస్తూ గొడ్డు చాకిరీ నుంచి వారికి విముక్తి కల్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా తెలుగుదేశానికి అనుబంధంగా పనిచేసే ఎన్నారై టీడీపీ బృందాలనూ రంగంలోకి దింపి బాధితులను ఎడారి కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు.
'సౌదీలో ఇబ్బందులు పడుతున్నా-రక్షించండి' - మంత్రి లోకేశ్‌కు మహిళ విజ్ఞప్తి
మరో మహిళకు అండగా : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో మహిళకు తాజాగా మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. ఆయన చొరవతో షేక్ మున్నీ అనే మహిళ స్వస్థలానికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన షేక్ మున్నీ ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. అయితే అక్కడకు చేరుకున్న తర్వాత ఆమె యజమాని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. యజమాని పెట్టే బాధలు భరించలేక స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేశ్‌ను ఆమె విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి తన టీం ద్వారా షేక్ మున్నీని క్షేమంగా రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చి ఆమె కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. తమ సమస్యను ఎక్స్ ద్వారా తెలిపిన వెంటనే స్పందించి మంత్రి లోకేశ్ చేసిన సాయం పట్ల బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.