AP Fibernet Corporation Sends Notice To Director RGV : సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆయనకు నోటీసులు పంపింది. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్‌నెట్ నుంచి కోటీ 15 లక్షల రూపాయల మేర అనుచితంగా లబ్ధి పొందడంపై రామ్‌గోపాల్‌వర్మకు లీగల్ నోటీస్ జారీచేశారు. ఈ మేరకు ఫైబర్‌నెట్ ఛైర్మన్ జి.వి.రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్‌నెట్ ఎండీ సహా ఐదుగురికి నోటీసులిచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యూహం సినిమాకు వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా రామ్‌గోపాల్‌వర్మతో ఒప్పందం చేసుకున్నారని జి.వి.రెడ్డి పేర్కొన్నారు. సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయని ఈ లెక్కన ఒక్కో వ్యూస్‌కు 11 వేల రూపాయల చొప్పున నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని వివరించారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇచ్చామని జి.వి.రెడ్డి వెల్లడించారు.
అరెస్టు చేస్తే జైల్లో నాలుగు సినిమా కథలు రాసుకుంటా: రాంగోపాల్ వర్మ
ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చెల్లింపులపై ప్రస్తుత ఛైర్మన్ జి.వి.రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు కేబుల్, ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా 2016లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL)ను అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారని జీవీ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 2019లో 24 వేల కి.మీ. కేబుల్ వేసి 10 లక్షల కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్ల సంఖ్య 5 లక్షలకు పడిపోయి, సంస్థ ప్రస్తుతం దివాళా అంచున ఉందని వివరించారు. గత ప్రభుత్వ తీరువల్లే దివాళా తీసే పరిస్థితికి వచ్చిందన్న ఆయన సంస్థలో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.
"2019లో 108 మంది ఉద్యోగులతో నెలకు 40లక్షల ఖర్చుతో నడిపి 10 లక్షల కనెక్షన్లను పెంచాం. కనెక్షన్లు 10 లక్షల నుంచి 5 లక్షలకు పడిపోయినా భారీగా అక్రమంగా ఉద్యోగులను నియమించారు. గతం ప్రభుత్వం 1363 మంది ఉద్యోగులను నియమించి నెలకు 4 కోట్లు వేతనాలు చెల్లించింది. ఉద్యోగుల వేతనాలు పదిరెట్లు పెరిగినా ఆ మేరకు కనెక్షన్లు పెరగాల్సి ఉండగా 5లక్షలు తగ్గాయి. కేబుల్ ఆపరేటర్లను చిత్రహింసలకు, వేధింపులకు గురి చేశారు. ఎపీఎస్ఎఫ్ఎల్ కు 1262 కోట్లు అప్పు చేశారు. టీడీపీ హయాంలో 3513 కోట్లు పెట్టుబడి పెట్టి 10లక్షల కనెక్షన్లు పెంచాం. అంతా రెడీగా ఉన్న సంస్థను వైఎస్సార్సీపీ హయాంలో 6869 కోట్లు ఖర్చుపెట్టి దివాలా తీయించారు.
పోలీసుల విచారణకు వర్మ డుమ్మా - వాట్సాప్‌లో ఏం మెసేజ్ చేశారంటే!
వందల మంది ఉద్యోగులను నియమించగా, వారంతా జీతాలు తీసుకుంటూ వైఎస్సార్సీపీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఇళ్లల్లో పనిచేశారు. విజిలెన్స్ విచారణ జరుగుతోంది.. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తా. వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి అక్రమంగా అధిక మొత్తాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మకు చెల్లించారు. ఎక్కడా లేని విధంగా 1863 వ్యూస్ వస్తే 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఏకంగా 2.10 కోట్లు రాంగోపాల్ వర్మకు అక్రమంగా చెల్లించారు" అని జీవీ రెడ్డి వెల్లడించారు.
ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రేక్షకులకు శుభవార్త.. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' తరహాలో కొత్త సినిమాలు