Hyderabad To Goa Special Train :ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ - వాస్కోడిగామా రైలును ప్రకటించింది. ఎప్పటి నుంచో ఈ రైలు తీసుకురావాలన్న డిమాండ్ ఉండగా ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అక్టోబర్ 6న సికింద్రాబాద్ నుంచి ఈ రైలును ప్రారంభించనున్నారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
సికింద్రాబాద్ టు గోవా ట్రైన్ టైమింగ్స్ ఇవే :సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్ కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైమరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? :కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్ కు అనుమతిస్తారు. 6వ తేదీ రైలు మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు చేరుకుంటుంది.