New Diaphragm Wall at Polavaram :ఏపీ జీవనాడి పోలవరం పనులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పోలవరం ప్రాజెక్ట్ పునఃనిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ పనులను నేడు ప్రారంభించనున్నారు. సుమారు వెయ్యి కోట్ల వ్యయంతో 1.396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇది సగం పూర్తి కాగానే దీనికి సమాంతరంగా దీనిపైనే ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభంకానున్నాయి. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.
ఉదయం10 గంటల 19 నిమిషాలను నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దెబ్బతిన్న పాత డయాఫ్రంవాల్‌కు 6 మీటర్ల ఎగువన 1.396 కిలో మీటర్ల పొడవున, 1.5 మీటర్ల మందంతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం ప్లాస్టిక్ కాంక్రీట్-T5 మిశ్రమాన్ని వినియోగించనున్నారు. కనిష్ఠంగా 20 మీటర్లు, గరిష్ఠంగా 94 మీటర్ల లోతు నుంచి నిర్మాణం చేపట్టనున్నారు. డయాఫ్రంవాల్ నిర్మాణాల్లో నైపుణ్యం ఉన్న బావర్ కంపెనీ ఈ పనులు చేపట్టనుంది. దీనికోసం 3 ట్రెంచ్ కట్టర్లు, 3 భారీ గ్రాబర్లు, 3 డిశాండింగ్ యూనిట్లు వంటి భారీ యంత్రాలను జర్మనీ నుంచి తెప్పించారు.
పోలవరం ప్రభావంపై తెలంగాణ అధ్యయనం - నివేదిక కోరిన రేవంత్‌రెడ్డి