Children Heartbreaking Situation in Lepakshi: ముద్దులు మూటగట్టుకుంటూ పుట్టిన బుజ్జాయిని చూసి ఆ దంపతులు మురిసిపోయారు. పిల్లాడి కాళ్లూ చేతుల్లో కదలికలు లేకపోయేసరికి ఎంతగానో ఆందోళన చెందారు. నరాల బలహీనత సమస్యగా మారి నిత్యం నరకం అనుభవిస్తున్న చిన్నారిని చూసి తల్లడిల్లిపోయారు. బాల్యం నుంచీ మంచానికే పరిమితమైన బిడ్డను చూస్తూ ఆవేదనను దిగమింగుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
మూడేళ్లు గడిచాక వారికి మరో అబ్బాయి పుట్టాడు. ఆ బిడ్డకూ అదే సమస్య తలెత్తింది. ఇద్దరు పిల్లలూ అచేతన స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం పెద్దబ్బాయికి పదహారేళ్లు, చిన్నోడికి పదమూడేళ్లు. కూలికి వెళ్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. బిడ్డలకు మెరుగైన వైద్యం అందించలేక ఆ దంపతులు పడుతున్న బాధ ఎవరినైనా కంటతడి పెట్టించక మానదు.
వివరాలివి:శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి ఎస్సీ కాలనీలో ఉంటున్న సూర్యప్రకాశ్, మంజుల దంపతులకు బాబు, నరేంద్ర సంతానం. ఇద్దరు కుమారులూ పుట్టుకతోనే నరాల బలహీనత, ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. స్థానిక వైద్యశాలల్లో చికిత్సలు చేయించి ఇంటి వద్దే బాగోగులు చూస్తున్నారు. కటిక పేదరికం అనుభవిస్తున్న వీరికి సెంటు భూమి కూడా లేదు. శిథిలావస్థకు చేరిన ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు. పిల్లలకు 90 శాతం శారీరక వైకల్యం ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్లు అందలేదు.
'కన్నతల్లి పెంచలేనంది - పెంచిన తల్లి భారమయ్యానంది - ఇద్దరు అమ్మలున్నా అనాథనయ్యాను' - 11 Month Old Baby In Orphanage
పింఛన్ల కోసం పలు దఫాలుగా దరఖాస్తులు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని ఆ దంపతులు చెబుతున్నారు. ఆన్‌లైన్లో పలుమార్లు దరఖాస్తులు చేసినా ఆధార్ కార్డుల్లో తప్పులున్నాయంటూ అధికారులు తిరస్కరించారని వాపోయారు. వాటిని సరిచేసి మరోమారు దరఖాస్తులు చేసినా ఇప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి తమ కుమారులకు పింఛన్లు అందించి వైద్యసేవలకు ఆర్థికసాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై లేపాక్షి ఎంపీడీవో వాసుదేవగుప్తాను వివరణ కోరగా.. గతేడాది ఆన్‌లైన్లో దరఖాస్తులు చేయడం వాస్తవమేనని, అప్పట్లో ఎన్నికల కోడ్ ఉండటంతో పింఛన్లు మంజూరు కాలేదని అన్నారు. ఈ క్రమంలో వారికి కచ్చితంగా పింఛన్లు మంజూరవుతాయని ఆయన చెప్పారు.
"పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ ఆన్‌లైన్లో దరఖాస్తులు చేశాం. ఆధార్ కార్డుల్లో తప్పులున్నాయని తిరస్కరించారు. వాటిని సరిచేసి మరోమారు దరఖాస్తులు చేసినా ఇప్పటికీ ఫలితం లేదు. మా కుమారులకు పింఛన్లు ఇచ్చి, వైద్యసేవలకు ఆర్థిక సాయం చేయాలని కొత్త ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం." - సూర్యప్రకాశ్, మంజుల దంపతులు
'అయ్యో చిట్టి తల్లీ!' చిన్నారికి ప్రాణాంతక వ్యాధి- రూ.16 కోట్ల ఇంజక్షన్ చేయించాలంటున్న వైద్యులు - child suffering with rare disease