NDSA Experts Committee on Kaleshwaram Project :ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రెండో రోజు ఇంజినీర్లతో సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డిజైన్ల విషయమై కమిటీ ఆరా తీస్తోంది. డిజైన్లు రూపొందించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో నిన్న సమావేశమైన కమిటీ ఇవాళ కూడా భేటీ కొనసాగిస్తోంది. బాధ్యులైన ఇంజినీర్లతో విడివిడిగా సమావేశమవుతున్న చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సభ్యులు డిజైన్లకు సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు.
బుధవారం రోజు బ్యారేజీలకు సంబంధించి భాగమైన ఇంజినీర్లతో సమావేశమైన ఎన్డీఎస్ఏ కమిటీ, ఆనకట్టల నిర్వహణ బాధ్యతలు చూసే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం నుంచి సమగ్ర వివరాలు కోరింది. ప్రత్యేకించి 2019లో సమస్యలు ఉత్పన్నమైనప్పటి నుంచి తీసుకున్న చర్యలు, చేపట్టిన తనిఖీల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ పనులు చేసిన గుత్తేదార్ల ప్రతినిధులతోనూ కమిటీ ఇవాళ సమావేశమైంది.
మూడు ఆనకట్టల మోడల్స్ ను కమిటీ రేపు పరిశీలించనుంది. గతంలో ఈఎన్సీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మురళీధర్, రామగుండం ఈఎన్సీగా ఉండి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణాన్ని పర్యవేక్షించిన నల్లా వెంకటేశ్వర్లుతో కూడా కమిటీ సమావేశమైంది. మొదట వెంకటేశ్వర్లుతో సమావేశమైన కమిటీ మూడు ఆనకట్టల అంశాలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు.
ఇన్వెస్టిగేషన్స్ మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాల గురించి తెలుకున్నారు. మురళీధర్‌తో విడిగా సమావేశమైన కమిటీ మేడిగడ్డలో పియర్స్ ఎందుకు కుంగి ఉండవచ్చో అడిగారు. దిగువన ఇసుక కదలిక, సీకెంట్ ఫైల్స్ తదితరాల గురించి అడిగినట్లు సమాచారం. ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో కమిటీ విడివిడిగా సమావేశమైంది. వ్యాప్కోస్ సంస్థ చేసిన సర్వే దాని తనిఖీ గురించి ఆరా తీశారు. డీపీఆర్, డిజైన్ల గురించి ప్రధానంగా వివరాలు తెలుసుకున్నారు.
ముగిసిన ఎన్డీఎస్ఏ కమిటీ పర్యటన - బ్యారేజీల కీలక వివరాలు సేకరించిన బృందం