NDSA Committee Visit Medigadda Barrage :మేడిగడ్డ విచ్చేసిన జాతీయ డ్యాం సేఫ్టీ అధారిటీ నిపుణుల బృందం(NDSA) బ్యారేజీని ఆసాంతం సందర్శించింది. మధ్యాహ్నం తరువాత అన్నారం బ్యారేజీ సందర్శించాల్సి ఉండగా, దానిని రేపటికి వాయిదా వేసి ఇవాళ రోజంతా మేడిగడ్డ బ్యారేజీ(Medigadda) కుంగుబాటుపైనే నిపుణులు దృష్టి సారించారు. దాదాపు 6 గంటల సేపు వీరి పరిశీలన సాగింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జే.చంద్రశేఖర్ అయ్యర్ నేతృతంలో ఐదుగురు సభ్యుల బృందం విస్తృత అధ్యయననం చేశారు.
NDSA Investigate kaleshwaram Project :ఉదయం బ్యారేజీ సందర్శనకు ముందు నిపుణుల కమిటీ, ఎల్ అండ్ టీ అతిధి గృహంలో అధికారులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం బ్యారేజీ వద్దకు చేరుకుని, ఆనకట్ట కుంగుబాటుకు ఏమేరకు ఉందన్నదీ నిశితంగా పరిశీలించారు. బ్యారేజీ దిగువకు వెళ్లి, 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్ల కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేసింది. బ్యారేజీకి ఏర్పడ్డ పగుళ్లను నిపుణులు నిశితంగా పరిశీలించారు. ర్యాఫ్ట్ దిగువున ఇసుక పూర్తిగా కొట్టుకునిపోయి ఖాళీ ఏర్పడడాన్ని గమనించారు.
బ్యారేజీ 6, 8 బ్లాకుల పియర్లలోనూ పగుళ్లు ఏమైనా ఉన్నాయాన్నది, నిపుణుల బృందం పరిశీలించింది. ఆనకట్ట సామర్ధ్యాన్ని పూర్తిగా విశ్లేషించి, ఎలాంటి మరమ్మతులు అవసరమో ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. ఎన్డీఎస్ఏ బృందం పర్యటన సందర్భంగా ఎల్ అండ్ టీ సంస్ధ ప్రతినిధులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాను బ్యారేజీపైకి అనుమతించలేదు. ఎస్బీ, పోలీసులను సైతం బ్యారేజీపైకి రాకుండా కట్టడి చేశారు.