NDSA Committee On Kaleshwaram :కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నీటినిల్వ చేసేందుకు నిర్మించారా లేక నీటిమళ్లింపు కోసమా అని మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నీటిపారుదల శాఖ అధికారులని ప్రశ్నించారు. బ్యారేజీల గేట్ల నిర్వహణ షెడ్యూల్‌కు బాధ్యులెవరు? ఇది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజినీరింగ్ రీసెర్చి ల్యాబొరేటరీ సలహాలకు భిన్నంగా ఏమైనా జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు.
NDSA Committee Second Visit : నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ సంస్థ ఏమైనా లోపాలు ఉన్నాయని గుర్తించిందా? వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీల తనిఖీలు నిర్వహించారా అంటూ పలు ప్రశ్నలను కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఛైర్మన్‌గా గల నిపుణుల కమిటీ నీటిపారుదల శాఖపైకి సంధించింది. ప్రస్తుతం బ్యారేజీలు (Medigadda barrage)నిర్మించిన స్థలాన్ని ఎంపిక చేయడానికి గల కారణాలు, ప్రత్యామ్నాయంగా పరిశీలించిన స్థలాల వివరాలు, మూడు ఆనకట్టల నిర్మాణం ప్రధాన లక్ష్యాలను తెలపాలని చెప్పింది. దీర్ఘకాలంలో వీటి రక్షణకు ఏం చర్యలు తీసుకోవాలో సూచించాలని అడిగింది.
నాణ్యత పరంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? :తెలంగాణలోఈనెల 20 నుంచి 22 వరకు పర్యటించిన కమిటీ తిరిగి వెళ్తూ కీలకమైన విభాగాలకు ప్రశ్నావళి అందజేసి ప్రతి ప్రశ్నకు ఆధారాలతో జవాబులు ఈరోజు అందజేయాలని కోరింది. ఒక్కో విభాగానికి 20 నుంచి 50కి పైగా ప్రశ్నలు అడగడటంతో నీటిపారుదలశాఖ కొంత సమయం కోరినట్లు తెలిసింది. ప్రాజెక్టు ఇంజినీర్లు, నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్), సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల నుంచి 150కి పైగా ప్రశ్నలకు సమాధానం కోరినట్లు తెలిసింది.
బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? - అధికారులపై ఎన్డీఎస్ఏ కమిటీ ప్రశ్నల వర్షం
150కి పైగా ప్రశ్నలకు సమాధానం :ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్), హైడ్రాలజీ-ఇన్వెస్టిగేషన్, సీడీఓ(సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్), ప్రాజెక్టు నిర్మాణ విభాగం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజినీర్ల బాధ్యతలు, తప్పనిసరిగా చేయాల్సిన పనుల వివరాలు ఏమిటి? సీడీఓ చీఫ్ ఇంజినీర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ రామగుండం, చీఫ్ ఇంజినీర్(క్వాలిటీ కంట్రోల్), ఇంజినీర్ ఇన్ చీఫ్(ఓఅండ్‌ఎం) తదితరులు ఎవరికి రిపోర్టు చేయాలి?
- నీటిపారుదలశాఖలోని నిర్మాణ విభాగం సీడీఓ ఇచ్చిన సలహాలు, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలా?
- కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఎవరి నుంచి సీడీఓకు వచ్చింది, డీపీఆర్‌లో సీడీఓ పాత్ర? కేంద్ర జలసంఘం డీపీఆర్‌ను పరిశీలించినపుడు సీడీఓ ఏదైనా లేఖ లేదా సర్టిఫికెట్ ఇచ్చిందా? ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, హైడ్రాలిక్-స్ట్రక్చరల్ డిజైన్, నేలను బాగుచేయడం, మూడు బ్యారేజీల నిర్మాణంలో సీడీఓ పాత్ర ఏమిటి?
- ఆనకట్టలు నిర్మాణంలో ఉన్నప్పుడు పరిశీలించే పరిధి సీడీఓకు ఉందా? ఇచ్చిన డ్రాయింగ్ల ప్రకారం నిర్మిస్తున్నారా అనేది పరిశీలించడానికి సీడీఓ అధికారులు తరచూ వెళ్లారా? సీడీఓ అడిగిన సమాచారం అంతా వచ్చిందా?
- బ్యారేజీల కింద ప్రవహించే సబ్ సర్ఫేస్ నీటి ప్రవాహమెంత? బ్యారేజీల నిర్మాణ ప్రాంతాన్ని సీడీఓ ఎక్కడ డిజైన్ చేసింది, డీపీఆర్‌లో ఉన్నట్లుగానా లేక హైపవర్ కమిటీ ఆమోదించినట్లుగానా? బ్యారేజీల ఎగువన, దిగువన కట్ ఆఫ్‌లకు సంబంధించిన వివరాలు, కట్ ఆఫ్-రాఫ్ట్‌కు జాయింట్ కనెక్షన్లు పెట్టడానికి, సీకెంట్, షీట్ పైల్స్, ఆర్సీసీ డయాఫ్రం వాల్ లొకేషన్స్‌కు సంబంధించి సీడీఓ అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన వివరాలు.
- మూడు ఆనకట్టల్లో పైపింగ్ ఏర్పడటానికి కారణమేమిటని సీడీఓ భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ప్రారంభించిన తర్వాత సమస్యలు తలెత్తడానికి కారణాలేంటి?
- మూడు ఆనకట్టల నాణ్యతలో ఎక్కడ రాజీపడ్డారని అడిగారు. వీటిని అధిగమించడానికి చేసిన సిఫార్సులు వివిధ దశల్లో తనిఖీలు చేపట్టి గుర్తించిన అంశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, డిజైన్ మిక్స్, ఇతర అంశాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలు, క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్‌లు తెలపాలన్నారు.
- కాళేశ్వరం ప్రాజెక్టు, ఆనకట్టలకు సంబంధించిన జీఓలు చూపించాలన్నారు.
- సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు పరిశీలించిన అంశాలు, లేవనెత్తిన అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పారు.
- 2019 వర్షాకాలంలోనే ఇబ్బంది వచ్చినా దానిని పట్టించుకోకపోవడం వల్ల సమస్య తీవ్రత పెరిగి మూడు ఆనకట్టలకు నష్టం వాటిల్లిందా?
మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం - అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా ఆనకట్ట పనులు - NDSA Committee On Kaleshwaram
కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత లోతుగా అధ్యయనం చేయాలన్న కేంద్ర కమిటీ - DG Rajiv Ratan on Medigadda