YSRCP Leaders Corruption in Kuppam RESCO Chittoor District :కుప్పం నియోజకవర్గ రైతులకు దశాబ్దాలుగా మెరుగైన విద్యుత్ సేవలు అందించిన రెస్కో వైఎస్సార్సీపీ దోపిడీతో అధోగతిపాలైంది. రెస్కోలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అవినీతిపుట్టలు పగులుతున్నాయి.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని వ్యవసాయ, గృహ అవసరాలు, పరిశ్రమలకు మెరుగైన విద్యుత్ అందించే లక్ష్యంతో 1982లో కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (రెస్కో)ను ఏర్పాటు చేశారు. విద్యుత్ లైన్లు ఆధునికీకరించడం, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ యోజన కింద కేంద్రం సాయంతో ఒక్కో రైతుకు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్ అందించారు.
ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ కొనుగోలు చేసి, అతి తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ అందించిన రెస్కో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గణనీయమైన ప్రగతి సాధించింది. 5 కోట్ల రూపాయల మిగులు నిధులతో జెన్కో, ట్రాన్స్‌కో సంస్థలకు ఎలాంటి బకాయిలు లేకుండా లాభాల బాటలో నడిచింది.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ అక్రమాలకు నిలయంగా మారిపోయింది. మిగులు బడ్జెట్‌తో లాభాల బాటలో ఉన్న రెస్కో ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి దిగజారిపోయింది. 2019 నుంచి 2024 వరకు రెస్కో ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేత సెంథిల్‌కుమార్ రెస్కోను భ్రష్టుపట్టించారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో సెంథిల్‌కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.