NDA Announce Free Bus to Women in Andhra Pradesh : విద్యార్థినిలు కాలేజ్‌కు వెళ్లేందుకు నెలవారీ బస్‌పాస్ కోసం డబ్బులు వెతుక్కోవాలి. చిరుద్యోగులు పని ప్రదేశాలకు వెళ్లాలంటే ఛార్జీలకు చిల్లర ఉందో లేదో సరిచూసుకోవాలి. పిల్లాపాపలతో పుట్టినింటికో, మెట్టినింటికో వెళ్లాలంటే ప్రయాణానికే కనీసం వెయ్యి రూపాయలు కావాలి. ప్రయాణమంటే ఎక్కడైనా ఇలా లెక్కలు వేసుకోవాల్సిందే. కానీ తెలంగాణలో మహిళలకు ఆ బెంగే అక్కర్లేదు. పర్సులో పైసా లేకుండా ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా చుట్టివస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం కూటమి కూడా మహిళలకు ఉచిత ప్రయాణ హామీ ఇచ్చిన వేళ తెలంగాణ మహిళలు ఎంతమేర లబ్ధి పొందారో ఇప్పుడు చూద్దాం.
ఇందులో అన్ని వర్గాల మహిళలున్నారు. అందరూ వేర్వేరు అవసరాల రీత్యా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తొస్తున్నావారే ఉన్నారు. ఆర్టీసీ బస్సెక్కినవారే. కానీ ఒక్క రూపాయి కూడా టికెట్‌కు ఇవ్వలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. తెలంగాణలోని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లతోపాటు, గ్రేటర్ హైదరాబాద్‌లోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు వైఎస్సార్సీపీ ఆరాటం
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 45 లక్షల మంది ప్రయాణిస్తుంటే అందులో 29 లక్షల మంది మహిళలే ఉన్నారు. కళాశాలలు, కోచింగ్‌లకు వెళ్లే అమ్మాయిలు ఒకప్పుడు నెలవారీ పాస్‌తీసుకునే వారు కానీ ఇప్పుడు ఆధార్‌కార్డు చూపించి ఫ్రీగా వెళ్లొస్తున్నారు. ఒక్క విద్యార్థినికి తక్కువలో తక్కువ వెయ్యి రూపాయల వరకూ మిగులుతోంది. ఆ డబ్బుతో పుస్తకాలు, ఇతర స్టేషనరీ సామాగ్రి కొనుక్కుంటున్నారు. మహిళలు ఒకప్పుడు చిరుద్యోగం దొరికితే ఆ వచ్చే డబ్బు ఛార్జీలకే సరిపోవని తిరస్కరించేవారు. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీకావడంతో ఎంచక్కా వెళ్లి వస్తున్నారు. ఆదా అయిన డబ్బుతో నిత్యావసరాలు కొనుక్కుకుంటున్నారు.