NDA Alliance Victory Celebrations in AP : రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంతో తెలుగుదేశం శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఫలితాలు వెలువడి మూడు రోజులు పూర్తయిన శ్రేణులు విరామం ప్రకటించకుండా సందడి చేస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు నుంచి తిరుమలగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేశారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద తెలుగు యువత కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. తర్వాత ఉద్యోగులకు మిఠాయిలు పంచారు. సీఐడీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో జగన్ అరాచక పాలన సాగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇకపై రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందన్నారు.
కూటమి ఘన విజయం - ఊరువాడా మిన్నంటిన సంబరాలు - TDP Victory Celebrations in AP
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికైన కన్నాను గజమాలతో సత్కరించారు. కన్నా కార్యకర్తలతో కలిసి నందిగామ రోడ్డు నుంచి టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యేగా ఎన్నికైన M.M కొండయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ శాఖల అధికారులు, కూటమి కార్యకర్తలు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలుపొందడంతో నాని సతీమణి సుధారెడ్డి, మహిళలు సంబరాలు చేశారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోని నాగలమ్మ అమ్మవారికి స్థానికులతో కలిసి సుధారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లికి 501 కొబ్బరికాయలు కొట్టి మెుక్కులు చెల్లించారు. తెలుగుదేశం ఘన విజయాన్ని కాంక్షిస్తూ మెుక్కులు చెల్లిస్తున్నామని సుధారెడ్డి తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక మహిళగా మహిళలందరికీ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు.