క్షుణ్నంగా పరిశీలిస్తూ, కొలతలు తీస్తూ, కారణాలు అన్వేషిస్తూ - మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్డీఎస్ఏ నిపుణులు National Dam Safety Authority Team on Kaleshwaram Project :పరిశీలిస్తూ, వివరాలు సేకరిస్తూ, కొలతలు తీసుకుంటూ బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు అన్వేషిస్తూ ఎన్డీఎస్ఏ (NDSA) బృందం తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ పర్యటన సాగింది. గురువారం ఉదయం నుంచి రాత్రి దాకా నిర్విరామంగా నిపుణులు బ్యారేజీ కుంగుబాటుకు దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేశారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నానికే మేడిగడ్డ(Medigadda) పర్యటన ముగించుకుని, అన్నారం బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కుంగుబాటు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మేడిగడ్డ బ్యారేజీపైనే రోజంతా గడిపారు. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల బృందం, ఉదయం బ్యారేజీ సందర్శనకు ముందుగా ఎల్ అండ్ టీ అతిథి గృహంలో అధికారులతోనూ, ప్రాజెక్టు ఇంజినీర్లతోనూ బృందం సభ్యులు సమావేశమయ్యారు.
అనంతరం వాహనాల్లో బ్యారేజీ వద్దకు చేరుకుని ఆనకట్ట కుంగుబాటు ఏ మేరకు ఉందన్నదీ నిశితంగా పరిశీలించారు. బ్యారేజీ దిగువకు వెళ్లి 7వ బ్లాక్‌లో కుంగి పగుళ్లు బారిన పడిన 20వ పియర్‌తో సహా 18, 19, 21 పియర్లు ఎంత మేరకు కుంగుబాటుకు జరిగింది? అందుకు దారితీసిన కారణాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేసింది. బ్యారేజీకి ఏర్పడ్డ పగుళ్లను, నెర్రలు బారిన ప్రదేశాన్ని నిపుణులు గంటల సేపు నిశితంగా పరిశీలించి కొలతలు తీసుకున్నారు. 7వ బ్లాక్‌లో ర్యాఫ్ట్ దిగువున ఇసుక పూర్తిగా కొట్టుకునిపోయి ఖాళీ ఏర్పడడడాన్ని గమనించారు. 6, 8 బ్లాకుల పియర్లలోనూ పగుళ్లు ఏమైనా ఉన్నాయన్నదీ, నిపుణుల బృందం పరిశీలించింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి కమిటీ
NDSA Team Visit Annaram and Sundilla Barrage :గతేడాది అక్టోబర్ 21న రాత్రి ఏం జరిగిందన్నదీ అధికారులను నిపుణులు అడిగి తెలుసుకున్నారు. పెద్ద శబ్దం వచ్చిందని, బ్యారేజీపై వచ్చి చూడగా కుంగుబాటుకు గురైనట్లు ప్రాజెక్టు అధికారులు బృందానికి తెలియచేశారు. వంతెనపై ఏ మేరకు కుంగుబాటు గురైందన్నదీ, కొలతలు తీసుకున్నారు. బ్యారేజీ గేట్ల సామర్ధ్యాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. బ్యారేజీ దిగువన ఇసుక మేటలు పైభాగంలో నిర్మించిన కాపర్ డ్యామ్‌ను పరిశీలించారు. నిర్మాణం పూర్తైన తరువాత కాపర్ డ్యాం(Coffer Dam) తొలగించలేదన్నదీ నిపుణులు గుర్తించారు.
బ్యారేజీ గేట్ల నిర్వహణ, గత రెండు సంవత్సరాలుగా వచ్చిన వరద ఉద్ధృతి, బ్యారేజీ నిర్మాణం జరిగిన అనంతరం చేపట్టిన మెయింటెనెన్స్ చర్యలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీపై డబుల్ పిల్లర్ల జాయింట్లను వాటి మధ్య తేడాలను పరిశీలించారు. బ్యారేజీ పర్యటన ముగించుకుని ఎల్ అండ్ టీ అతిథి కార్యాలయానికి వెళ్లి ఇంజినీర్లతో దాదాపు రెండు గంటల సేపు చర్చించారు. ఆనకట్ట సామర్ధ్యాన్ని పూర్తిగా విశ్లేషించి ఎలాంటి మరమ్మతులు అవసరమో ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. ఈఎన్సీ నాగేంద్ర, సీఐ సుధాకర్‌రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రతినిధులు, బృందం వెంట ఉన్నారు.
రాత్రి 8 గంటల ప్రాంతంలో మేడిగడ్డ పర్యటన ముగించుకుని నిపుణులు, రామగుండం బయలుదేరి వెళ్లారు. ఇవాళ అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలను పరిశీలించి, రాత్రికి హైదరాబాద్ బయల్దేరి వెళతారు. నిపుణుల బృందం బ్యారేజీ పరిశీలనకు మీడియాను అనుమతించలేదు. స్పెషల్ బ్రాంచి నిఘా వర్గాల పోలీసులను సైతం ఫోటోలు తీయకుండా ఎల్ అండ్ టీ(L&T) ప్రతినిధులు అడ్డుకున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ దిగువన చెల్లాచెదురుగా సిమెంట్ దిమ్మెలు..