Narasapuram MPDO Missing Case: గత నాలుగురోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణారావు కుటుంబసభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. సీఎంవో ఆదేశాలతో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కానూరులోని మహదేవపురం కాలనీలో ఎంపీడీవో కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం విషయాలను సీఎంవోకి తెలియజేశారు. తర్వాత కలెక్టర్‌కు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు, ఎంపీడీవో భార్య సునీతతో మాట్లాడారు.
రమణారావు చివరిసారిగా ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఏమి చెప్పారు, ఆయన ఒత్తిడికి గురికావటానికి కారణాలేంటని అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని సీఎంకి సునీత తెలిపారు. కలెక్టర్ కూడా కొన్ని విషయాలను సీఎం దృష్టికి తెచ్చారు.
ఆ తర్వాత కుమారుడు సాయిరాంతో మాట్లాడిన ముఖ్యమంత్రి, గతంలో ఎప్పుడైనా ఏమైనా అంశాలు మీ దృష్టికి తీసుకువచ్చారా అని అడిగారు. అయితే కొన్ని ఫోన్ నంబర్లకు తాను కూడా డబ్బులు పంపించానని చెప్పిన కుమారుడు, అలా డిమాండ్ చేసిన వారి వెనక వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజుతో పాటు ఫెర్రీ బోట్ కాంట్రాక్టర్ ఉన్నారోమోనని తన తండ్రి అనుమానం వ్యక్తంచేశారని వివరించారు.
నరసాపురం ఎంపీడీవో కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు - police search for Narasapuram mpdo
వెంకటరమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని ఘటనపై పూర్తివిచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు. నిజాయితీపరుడు, సమర్థుడు అయిన అధికారి ఆచూకీ లేకపోవటంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వెంకటరమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్‌తో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.
ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు. అనంతరం కలెక్టర్ చదలవాడ నాగరాణితో ఎంపీడీవో కుటుంబసభ్యులు మాట్లాడారు. వైఎస్సార్సీపీ నేతల ఒత్తిళ్లతోనే వెంకటరమణారావు ఆచూకీలేకుండా పోయారని అన్నారు. ఈ నెల 14 ఇంటి నుంచి మచిలీపట్నం బయలుదేరిన వ్యక్తి ఆ తరువాత కనపడకుండా పోయారని కన్నీళ్ల పర్యంతమయ్యారు.
16 వ తేదీన పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మాధవాయిపాలెం రేవుకు సంబంధించి పాటదారు భారీగా డబ్బులు బకాయి ఉండటం, వేధించటంతో మానసికంగా కుంగిపోయినట్లు వెంకటరమణ లేఖలో పేర్కొన్న విషయాన్ని కుటుంబసభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు కూడా ఎంపీడీవో, అతని కుమారుడు డబ్బులు పంపించిన ఫోన్ నంబర్లు ఎవరివి, ఎంత చెల్లించారనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు తెలిస్తే కేసు ముందుకు సాగే అవకాశం ఉంది.
ఎంపీడీవో రమణారావు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు - CHANDRABABU PHONE TO MPDO FAMILY