Nara Lokesh Sankharavam Meeting: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో విశాఖను పూర్తిగా నాశనం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు దొరికినా కబ్జా చేసే పరిస్థితి తలెత్తిందని లోకేశ్ అన్నారు. గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖను మార్చేసిన ఘనత వైఎస్సార్‌సీపీదేనని దుయ్యబట్టారు. రెండు నెలలు ఓపిక పట్టండని ఆ తర్వాత టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సూచించారు. గంజాయి అనేది లేకుండా చూసే బాధ్యత తమదని లోకేశ్ స్పష్టం చేశారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ పాల్గొన్నారు. విశాఖలో ప్రస్తుతం రోజుకొక భూకబ్జా, విధ్వంసం, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని లోకేశ్ మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉందని వివరించారు. వందలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ లోడ్ ఇసుకకు వెయ్యి రూపాయలు ఉంటే, ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగిందన్నారు.
విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది: లోకేశ్
ఐదేళ్లుగా తెలుగుదేశం నేతలపై అనేక అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కూడా 22 అక్రమ కేసులు పెట్టినట్లు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని లోకేశ్ గుర్తు చేశారు. ప్రశాంత వాతావరణం ఉండే విశాఖను విషాదనగరంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టినా తెలుగుదేశం కార్యకర్తలు నిలబడి పోరాడారని గుర్తు చేశారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటే పార్టీ తెలుగుదేశమని మరోసారి స్పష్టం చేశారు. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.