Nara Lokesh Inspiring Journey :తాత మహానాయకుడు. తండ్రి దార్శనికుడు. ఇరువురి పేరు నిలిపేలా రాజకీయరంగంలో సంచలనాలు సృష్టించారు తెలుగుదేశం యువతేజం నారా లోకేశ్. అతడే ఒక సైన్యం. ఎండైనా, వానైనా, చలైనా, వడగాలైనా 226 రోజులపాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్రతో పల్లెపల్లెకూ చేరారు నారా లోకేశ్. ప్రజల మనిషిగా ఎదిగారు.
తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే అయి కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా, కార్యకర్తల సంక్షేమ విభాగం బాధ్యతలు తీసుకుని నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి పదవి చేపట్టి మూడు శాఖలను ప్రగతిపథంలో పరుగులు పెట్టించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసి 5 వేలు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో: ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడిపోలేదు. ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో పని చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు చేరువై సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల హృదయాలే కాదు నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. సమాజమనే దేవాలయంలో ప్రజలని దేవుళ్లు అనే తాత నినాదం, నాన్న విధానం పుణికిపుచ్చుకున్న నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్లపాటు తిరుగులేని ప్రజాశక్తిగా నడిపించగల దమ్ము ధైర్యం ఉన్న నేత అని నిరూపించుకున్నారు.
నారా లోకేశ్ విద్యాభ్యాసం: నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులకు 1983 జనవరి 23న జన్మించారు. నాన్నది నారా వారి పల్లె. అమ్మది నిమ్మకూరు. బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్, విద్యాశ్రమంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇంటర్మీడియెట్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ, హైదరాబాద్‌లో కంప్లీట్ అయ్యింది. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అమెరికాలో కార్నెగీ మెలన్ వర్సిటీలో బీఎస్సీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డిగ్రీ పొందారు. హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా, హెరిటేజ్ ఫిన్‌లీజ్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
రాజకీయరంగ ప్రవేశం:వరల్డ్ బ్యాంకు మద్దతుతో వివిధ దేశాలలో అమలయ్యే కెపాసిటీ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ఈ గవర్నెన్స్, కనెక్టివిటీ సొల్యూషన్స్ అంశాలలో ప్రాజెక్టు మేనేజర్‌గా(2004-2006) పనిచేసిన నారా లోకేశ్ స్వదేశానికి చేరుకున్నారు. పూర్తిస్థాయి రాజకీయరంగ ప్రవేశం 2013లో చేసి, 2014 టీడీపీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర వహించారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో నారా లోకేశ్ పోషించిన పాత్ర ఎనలేనిది.