Nara Bhuvaneswari on Euphoria Musical Night Program: సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ నినాదంతోనే ట్రస్టు కార్యక్రమాలు సాగుతున్నాయని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమ వివరాలను ఆమె వెల్లడించారు. రక్తహీనత వల్ల తలసేమియా బాధితులు పడే ఇబ్బందుల్ని తొలగించేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధిన పడుతూ ఊపిరి తీసుకోవటానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె, బ్లడ్ ట్రాన్స్మిషన్కు కూడా రక్తం ఎంతో అవసరమని తెలిపారు.
ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరినీ రక్తదానంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. రక్తదానం వల్ల ఇతర జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అన్నారు. సమాజహితం కోసం కార్యక్రమం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా తమన్ అంగీకారం తెలిపారన్నారు. తెలుగుతల్లికి రుణం తీర్చుకునే అవకాశంగా ప్రతి ఒక్కరూ భావించి సమాజ సేవలో పాల్గొనాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.
నారా భువనేశ్వరి ఆసక్తికర సమాధానాలు: అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నారా భువనేశ్వరి ఆసక్తికర సమాధానాలు చెప్పారు. మ్యూజికల్ నైట్‌కు సీఎం లేదా భద్రతా సిబ్బంది ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందేనని అన్నారు. కుటుంబానికి రూ.6 లక్షలతో చంద్రబాబే టికెట్లు కొని టేబుల్ బుక్ చేశారని తెలిపారు. హెరిటేజ్, ట్రస్టు కోసం ఏదైనా చేస్తామంటే చంద్రబాబు అంత తేలిగ్గా ఒప్పుకోరని పేర్కొన్నారు. ఎవరి కాళ్లపై వాళ్లే నిలబడాలని చంద్రబాబు అనేవారని, ట్రస్టు కార్యక్రమాలపై ఆయనను తానేమీ అడగనని స్పష్టం చేశారు.