Nara Bhuvaneshwari Visit to Kuppam : అన్ని రంగాల్లోనూ మహిళలు ముందు వరుసలో ఉంటేనే ఉన్నతికి చేరుకోగలరని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా గురువారం శాంతిపురం, గుడుపల్లె మండలాలతోపాటు కుప్పం మున్సిపాలిటీలో ఆమె పర్యటించారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, నలగాంపల్లెలో మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులు సరదాగా అడిగిన పలు ప్రశ్నలకు ఆమె అంతే హృద్యంగా సమాధానాలిచ్చారు.
విద్యార్థులతో భువనేశ్వరి మాటామంతి
విద్యార్థి:చంద్రబాబు నుంచి ఎప్పుడైనా కానుక అందుకున్నారా?
భువనేశ్వరి: లేదు... నా స్నేహితురాలికి ఆమె భర్త పుట్టినరోజు కానుకగా డైమండ్ రింగ్ కొని ఇచ్చారు. నా పుట్టినరోజుకు బహుమతిగా ఏదైనా కొని ఇవ్వొచ్చు కదా అని చంద్రబాబును అడిగితే నువ్వే పెద్ద డైమండ్, నీకెందుకు డైమండ్ అనేశారు.
విద్యార్థి:బాలకృష్ణ చిత్రాల్లో ఏది ఇష్టం
భువనేశ్వరి:నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ ఇష్టం
విద్యార్థి: బాలయ్య డైలాగ్ ఒకటి చెప్పండి
భువనేశ్వరి: ‘ఒకవైపే చూడు ఇంకోవైపు చూడకు ’ ప్రతి ఒక్కరూ లక్ష్య సాధనకు ముందుచూపుతో సాగాలని దాని అర్థం. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు అలవాటు పడి కుటుంబ బంధాలను దూరం చేసుకోవద్దు, డ్రగ్స్‌కు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు విద్యార్థి దశ నుంచి లక్ష్యం వైపు అడుగులు వెయ్యాలి.
విజయం ఊరికే రాదు - కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి
హెరిటేజ్ బాధ్యతలు సవాల్‌గా తీసుకున్నా :భువనేశ్వకి విద్యార్థులతో మాట్లాడుతూ తాను చదువుకుంటూ ఉండగానే 19 ఏళ్లకే పెళ్లి చేశారని తెలిపారు. చంద్రబాబు తనపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలను అప్పగించారని దాన్ని సవాల్‌గా తీసుకొని సంస్థను ముందుకు తీసుకెళ్లానని భువనేశ్వరి పేర్కొన్నారు.
అనంతరం కుప్పంలోని ఎన్టీఆర్ ట్రస్టు నైపుణ్యాభివృద్ధి కేంద్రంలోని ఉత్పత్తులను పరిశీలించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చిరువ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. డీఎస్సీ ఉచిత శిక్షణ తరగతులను పరిశీలించారు. మండలి విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, ట్రస్టు సీఈవో రాజేంద్రకుమార్, నాయకులు డాక్టర్ బీఆర్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కష్టకాలంలో రాజమహేంద్రవరం ప్రజలు ఎంతో ఆదరించారు - 53 రోజులు మరువలేనివి: నారా భువనేశ్వరి - Nara Bhuvaneshwari at Rajahmundry