Lentils Fraud Case Registered To Merchants: రైతుల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పంటల కొనుగోలు సమయంలో దళారులు చేస్తున్న ఘరానా మోసం రైతుల చొరవతో తూనికలు, కొలతల శాఖ తనిఖీల్లో బట్టబయలైంది. దీనితో కందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.
Merchants Cheating In Purchase Of Lentils: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో కందుల కొనుగోలు సమయంలో జరిగిన తూకాల్లో దళారులు చేస్తున్న మోసాన్ని రైతులు గమనించి వారిని అడ్డుకున్నారు. దళారులు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ కాటా యంత్రాన్ని, తమ నుంచి సేకరించిన కందుల బస్తాలను తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని రైతులు అడ్డగించి వజ్రకరూరు పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో గుంతకల్లు ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఆహార తనిఖీ నిపుణుల బృందం పోలీసు స్టేషన్ లో రైతులు పట్టుకున్న ఎలక్ట్రానిక్ కాటా యంత్రంను తెరచి పరిశీలించగా రైతులను మోసం చేయడానికి దళారులు అమర్చిన రిమోట్ కంట్రోల్‌తో నడిచే చిప్‌ను వారు కనిపెట్టారు.
అయిదుగురిపై కేసు నమోదు: వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి ఎలక్ట్రానిక్ కాటా యంత్రంలో చిప్ అమర్చి రిమోట్ కంట్రోల్‌తో రైతుల నుంచి 50 కేజీల బస్తాకు గాను 12 కేజీలను అదనపు కందులను సేకరిస్తున్నట్లు నిరూపణ అయిందన్నారు. మోసానికి పాల్పడిన ఐదుగురు దళారులపై చాబాలకు చెందిన రైతు రుద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తూనికలు కొలతల శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ కాటాను సీజ్ చేసి దళారులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తూకం మిషన్‌లో చిప్ పెట్టి మోసం చేస్తున్నారు. 50 కిలోలకు 60 కిలోలు తీసుకుంటున్నారు. ఓ రైతుకు అనుమానం వచ్చి పరిశీలిస్తే 50 కేజీల బస్తాకు 10 నుంచి 15 కిలోల వరకు మోసం జరిగినట్లు బయటపడింది. రైతు ఫిర్యాదు మేరకు ఐదుగురు దళారులపై కేసు నమోదు చేశాం. 70 క్వింటాళ్లు కందులు, వాహనం స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. -నాగస్వామి, ఎస్ఐ
ఇదీ జరిగింది: కొంతమంది దళారులు మార్కెట్ ధర కంటే అధిక ధరకు కందులను కొనుగోలు చేస్తామని గ్రామానికి వచ్చారు. మార్కెట్లో క్వింటాకు రూ.8 వేల రూపాయలకు కందుల ధర పలుకుతుండగా మేము రూ. 9,100 కొనుగోలు చేస్తామని రైతులను నమ్మించారు. దీంతో రైతులు ఆశ పడి వారికి అమ్మడానికి ఒప్పుకున్నారు. కానీ కందుల కోనుగోలు చేసేటప్పుడు మార్పులు చేసి 50 కేజీలు తూగాల్సిన చోట 62 కేజీలకు తూగేలా చేశారు.
మహా మాయగాళ్లు - మాటలతో లాక్ చేస్తారు - ఆపై అందినకాడికి సొమ్ము కాజేస్తారు
'పరిశీలన తర్వాత సందేహాలు పెరిగాయ్' - విశాఖ డెయిరీపై ఆడిట్ జరగాల్సిందే : ప్రత్యేక హౌస్ కమిటీ