Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది అభిమానులు, కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందినట్లు పార్టీ వర్గాలు నిర్ధారించాయి. నిజం గెలవాలి పర్యటన ప్రారంభం నుండి ఇప్పటిదాకా 194 కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ఈ నెల 11, 12, 13వ తేదీలలో పరామర్శించే కుటుంబాలను కలుపుకుని మొత్తం 203 కుటుంబాలకు పరామర్శ పూర్తవనుంది. పరామర్శతో పాటు ప్రతి బాధిత కుటుంబానికి 3 లక్షల చొప్పున భువనేశ్వరి ఆర్థికసాయం అందించారు. ఇప్పటి దాకా 25 పార్లమెంట్ల పరిధిలో 92 నియోజకవర్గాల్లో 8,478కి.మీ ప్రయాణించారు.
నేటి నుండి జరిగే మూడు రోజుల పర్యటనలో మరో 2 నియోజకవర్గాల్లో పర్యటించే వాటితో కలిపి మొత్తం 94 నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన పూర్తవనుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గతేడాది అక్టోబర్ 25న ప్రారంభమైన నిజం కార్యక్రమం ఈ నెల 13న కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గంలో ముగియనుంది. నేటి నుండి గుంటూరు, నరసారావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి మలి విడత కార్యక్రమం సాగనుంది. నేడు తెనాలి, వినుకొండ నియోజకవర్గాల్లో, 12న వినుకొండ, తిరువూరు నియోజకవర్గంలో, 13న తిరువూరు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించనున్నారు.