Nandigam Weavers Migration :చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో నేతన్న కుటుంబాలు వృత్తికి దూరమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి రాయితీలు రాక కష్టానికి తగిన గిట్టుబాటు ధర లేక శ్రీకాకుళం జిల్లాలో వందలాది చేనేత కుటుంబాలు వలస బాట పడుతున్నాయి. తరతరాలుగా సంప్రదాయ చేతి వృత్తి చేసుకుంటూ గౌరవంగా బతికిన ఊరిలోనే రోజు కూలీలుగా మారి చాలీచాలని ఆదాయంతో పూట గడవడమే కష్టంగా ఉన్న దయనీయ స్థితిలో చేనేత కుటుంబాలు బతుకులీడుస్తున్నాయి.
ఇతర రాష్ట్రాలకు వలసల వెల్లువ : శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో పెద్ద తామరపల్లి, నర్సిపురం, రౌతుపురం, సైలాడ, కాపు తెంబూరు, గ్రామాల్లో వందలాది చేనేత కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ తయారు చేసిన ఖాదీ వస్త్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఏళ్లుగా ప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం మరో పక్క చేనేతకు గిట్టుబాటు లేక వందలాది నేతన్న కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, ముంబై, సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, తదితర ప్రాంతాలకువలసవెళుతున్నారు. ఆ ప్రాంతాల్లో రోజు వారీ కూలీలుగా మారుతున్నారు.
నాటి కళ నేడు తప్పింది : ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో 350 పైగా కుటుంబాలు మగ్గాలతో నేత నేస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 20కి చేరిందంటే నేతన్నలు వలస బాట పడుతున్న దుస్థితిని తెలియజేస్తోంది. ప్రస్తుతం మగ్గాలు ఉన్న వారు కూడా చేసిన పనికి గిట్టుబాటు ధర రాకపోవడంతో రోజు వారి కూలీలుగా మారి కుటుంబాలను పోషిస్తున్నారు.